సజ్జలకు మైండ్ పోయింది!
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:48 AM
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ పోయిందని.. జగన్ వీరాభిమాని బోరుగడ్డ అనిల్ విరుచుకుపడ్డారు. ఆయన జపం చేస్తేనే వైసీపీ ఆఫీసులోకి రానిస్తారంట అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బోరుగడ్డ అనిల్ ఆక్రోశం
భార్యతోపాటు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా
ఎవరు నువ్వు.. పార్టీ ఆఫీసుకు ఎందుకు వచ్చావని సజ్జల అడిగాడు
ఇక పార్టీ కార్యాలయానికి రావద్దన్నాడు
నాకు అడ్వకేట్లను పెట్టలేమన్నాడు
మూడున్నర గంటలు పడిగాపులు పడ్డా అన్నం కూడా పెట్టలేదు
చెంచాగాళ్లతో తిట్టిస్తున్నాడు: బోరుగడ్డ
గుంటూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి మైండ్ పోయిందని.. జగన్ వీరాభిమాని బోరుగడ్డ అనిల్ విరుచుకుపడ్డారు. ఆయన జపం చేస్తేనే వైసీపీ ఆఫీసులోకి రానిస్తారంట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం జగన్ ఉండే తాడేపల్లి ప్యాలెస్ గేటు లోపలకు కూడా తనను రానివ్వలేదని మండిపడ్డారు. ప్యాలెస్ బయట ‘ప్రతి కార్యకర్త కష్టాన్నీ నేను మరిచిపోను’ అని ఉన్న జగన్ ఫ్లెక్సీ ముందే.. మంగళవారం మధ్యాహ్నం మండుటెండలో బోరుగడ్డ తన భార్యతో కలిసి బైఠాయించారు. జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల తనను అడ్డుకుంటున్నాడని బోరుమన్నారు. తనపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా.. సజ్జల, జగన్ పీఏ పూడి శ్రీహరి తమ చెంచాలతో తనను రౌడీషీటర్ అని ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ‘వారికి లాగా సజ్జలకు సపర్యలు చేయడం, మద్యం బాటిళ్లు తీసి పోయడం నాకు చేతకాదు. పార్టీ అధికారప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి నా ముందు బచ్చాగాడు. నేను తలుచుకుంటే సజ్జలను ఏదైనా చేయగలను. చిటిక వేస్తే సాయం త్రం కల్లా 4 వేల మందిని జగన్ ఇంటి ముందు కూర్చోబెట్టగలను.
అయినా పార్టీ మీద గౌరవంతో నేను, నా భార్య మాత్రమే వచ్చాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయేసరికి ఇలా కరివేపాకులా మమ్మ ల్ని ప్యాలెస్ గేటు బయటకు గెంటేయడం.. ప్రతి వైసీపీ కార్యకర్తకూ, నాయకుడికీ ఒక సందేశం. సజ్జ ల ఒకప్పుడు నువ్వు పార్టీకి చాలా బలమన్నాడు. 20 రోజుల క్రితం చల్లా మధు ఫోన్ చేస్తే మంచి అడ్వకేట్‌ను పెట్టమన్నాను. నన్ను ఎక్కడా ఎవరూ ఆపరు. వైసీపీ రాష్ట్ర కార్యాలయమైనా, పులివెందులలోనైనా సరే! ఇప్పుడు ఇక్కడ ఆపారు. అయినప్పటికీ పైకి పోయాను. పైన సజ్జల ఉన్నాడు. చూసి కూర్చోమన్నాడు. మూడున్నర గంటల తర్వాత బయటకు వచ్చాడు. అన్నం కూడా తినలేదు.. పార్టీ వాళ్లు వస్తే అన్నం పెట్టరా అని అడిగాను. నేను తెలియనట్లుగా ఎవరు నువ్వు అన్నాడు. నేను బోరుగడ్డ అనిల్‌నని చెప్పాను. నువ్వు ఇక్కడకు రావొద్దు.. నీకు అడ్వకేట్లను కూడా పెట్టలేమన్నాడు. పూడిశ్రీహరి, సజ్జల చెబితే నే నన్ను రౌడీషీటర్ అన్నానని కారుమూరు వెంకటరెడ్డి ఫోన్‌లో చెప్పాడు(ఆయనతో జరిగిన సంభాషణను అనిల్ విడుదల చేశారు). నేను లండన్‌లో పీజీ చేశా. మా నాన్న చనిపోయాక ఇక్కడకు వచ్చి జగన్ కోసం కష్టపడ్డాను. సజ్జల అరాచకాలన్నీ జగన్‌కు చెప్పడమే నా లక్ష్యం. నా కుటుంబం రోడ్డున పడింది. సజ్జల నామీద పగపట్టాడు’ అని విరుచుకుపడ్డారు.
దళితులందరినీ అవమానిస్తున్నారు
దళితుడినన్న కారణంగానే సజ్జల తనను చిన్నచూపు చూస్తున్నాడని బోరుగడ్డ ఆరోపించా రు. పార్టీలోని దళితులందరినీ ఇలానే అవమానాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. ‘జగన్ కోసం మేమంతా పనిచేశాం. రూ.కోట్లు ఖర్చు పెట్టాం. పార్టీ కోసం పదేళ్లు కష్టపడ్డాను.. పోలీసులు అరెస్టు చేసి.. చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. 9 నెలలు జైల్లో ఉన్నాను. సజ్జల మాత్రం ఇస్త్రీ బట్టలు వేసుకుని ఆఫీసులో కూర్చున్నాడు. ఏ రోజైనా పార్టీ జెండా పట్టుకున్నాడా? నన్ను తిట్టిన కారుమూరి వెంకటరెడ్డిని పార్టీ నుంచి డిస్మిస్ చేయాలి. నన్ను అవమానించినందుకు శ్రీహరి, సజ్జల బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నేను రిపబ్లిక్ పార్టీకి రాజీనామా చేశాను. ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాను. తక్షణమే సజ్జలను పార్టీ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరిని నియమించాలి’ అని డిమాండ్ చేశా రు. చాలాసేపు ప్యాలెస్ ఎదుట బైఠాయించిన బోరుగడ్డ.. ఇతర కార్యకర్తలకు కూడా తన గతే పడుతుందంటూ వెనుదిరిగారు. కాగా.. బోరుగడ్డకు పార్టీతో సంబంధం లేదని, అందుకే రానివ్వలేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.