బొర్రాలో మరో అందమైన గుహ
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:09 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బొర్రా గుహలకు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
కిలోమీటరుకు పైగా విస్తరించిన వైనం
అనంతగిరి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బొర్రా గుహలకు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుహలకు అనుసంధానంగా ఉన్న మరో కొత్త గుహను స్థానిక ఔత్సాహికులు కనిపెట్టారు. పాత గుహ సుమారు ఒకటిన్నర కిలోమీటరు మేర విస్తరించి ఉంటే... కొత్తది సుమారు కిమీ పరిధిలో విస్తరించి ఉందని చెబుతున్నారు. ఈ రెంటినీ అనుసంధానిస్తే.. మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కూటమి ప్రభుత్వం బొర్రా గుహలపై కూడా దృష్టి పెడితే... మరింత ఆదాయం సమకూరుతుందని, విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించే హంగులు దీనికి ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఇదో భూ విజ్ఞాన అద్భుతం
150 మిలియన్ ఏళ్ల క్రితం సహజ సిద్ధమైన అనేక రసాయనిక, భౌగోళిక చర్యల ఫలితంగా ఏర్పడిన భూ విజ్ఞాన అద్భుతమే ఈ బొర్రా గుహలు. ఈ గుహల పైనుంచే కొత్తవలస - కిరండోల్ రైల్వే లైను వెళుతుంది. ఈ గుహలను ఆనుకుని గోస్తనీ జీవనది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది సమీపంలోని కటిక గ్రామం వద్ద 50 అడుగుల ఎత్తునుండి పడుతుంది. కటిక జలపాతంగా పిలిచే ఇది నయనానందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం పర్యాటకులు చూస్తున్న గుహలకు అనుసంధానమై మరో గుహ పర్యాటకులకు అత్యంత సురక్షితమైనది. సుమారు నాలుగేళ్ల క్రితం అప్పటి పర్యాటక శాఖ ఎండీ కన్నబాబు బొర్రా గుహలను సందర్శించినప్పుడు రెండో గుహను స్థానికులు, గైడ్లు ఆయన దృష్టికి తెచ్చారు. దానిని పరిశీలించిన ఆయన... టర్కీ దేశంలోని టాప్‌డెక్, సయాహత్ కేవ్ రెస్టారెంట్లు మాదిరి పర్యాటకులకు మధురానుభూతి కలిగేలా ఏర్పాటు చేయడానికి ఏమైనా అవకాశం ఉందా?... అన్న కోణంలో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కన్నబాబు ఆదేశాల మేరకు రెండో గుహను పరీశీలించిన అధికారులు దానిని అందుబాటులోకి తీసుకొని రావడానికి, ప్రస్తుతమున్న బొర్రా గుహలను మరింత విస్తృతపర్చడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇదే కాదు... లోపల మరో గుహ కూడా ఉందని, అయితే దానిలో ప్రయాణం అత్యంత సంక్షిష్టంగా ఉంటుందని, అది నేరుగా గోస్తనీ ప్రవాహం వద్దకు దారి తీస్తుందని స్థానికులు చెపుతారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో కూడా దానిలోని నిజానిజాలను నిర్ధారణ చేయాలన్న ఆలోచన కూడా ఇంతవరకూ పర్యాటక శాఖ చేయలేదు. పర్యాటకులు వెళ్లడానికి అనువుగా ఉండే రెండో గుహ ముఖద్వారం వద్ద ఉన్న పూడికను తొలగించి, లోపల పర్యాటకుల నడకకు అనువైన నిర్మాణాలు చేపడితే ఇప్పుడు వస్తున్న పర్యాటకులకు రెట్టింపు మందిని ఆకర్షించవచ్చని పలువురు స్పష్టం చేస్తున్నారు. గతంలో కన్నబాబు సూచించినట్లు గుహ లోపల రెస్టారెంటు వంటి దానిని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తే అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుందని స్థానిక గైడ్లు వివరిస్తున్నారు.