Vijayawada Book Festival: పుస్తకం లేని ఉద్యమం లేదు
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:51 AM
పుస్తకం లేకుండా ఏ ధర్మమూ పుట్టలేదు. ఏ ఉద్యమమూ సాగలేదు. ఉద్యమాలకు పుస్తకమే మూలం’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు.
చారిత్రక పరిణామాలకు అదే మూలం: సిసోడియా
విజయవాడ బుక్ ఫెస్టివల్‌లో భాగంగా రచయితలతో పుస్తక పాదయాత్ర
విజయవాడ కల్చరల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘పుస్తకం లేకుండా ఏ ధర్మమూ పుట్టలేదు. ఏ ఉద్యమమూ సాగలేదు. ఉద్యమాలకు పుస్తకమే మూలం’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా 5వ రోజు, మంగళవారం పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన యాత్రను ఆర్పీ సిసోడియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల పుస్తకాల తయారీ, ప్రచురణ, పంపిణీ, పఠనాల స్వరూప స్వభావాలే మారిపోతున్నాయన్నారు. ప్రపంచాన్ని రూపొందించిన చారిత్రక, ఆధ్యాత్మిక పరిణామాలన్నిటికీ పుస్తకాలే మూలమన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ... పుట్టుకతో ఎలక్ర్టానిక్ తెరలకు పరిచయమవుతున్న నేటి తరానికి అచ్చు పుస్తకం చదవడంలో ఉండే ఆనందాన్ని పరిచయం చేయడానికి ప్రచురణకర్తలు, పుస్తక ప్రియులంతా కలిసి ఒక కార్యాచరణను రూపొందించి, అమలు చేయాలని సూచించారు. కొత్త తరానికి పుస్తకాన్ని పరిచయం చేసేందుకు పుస్తక ప్రదర్శనలు కొంతవరకు ఉపయోగపడతాయన్నారు. కాగా, పాదయాత్ర అనంతరం సభను మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభగా నిర్వహించారు. మండలి జీవితంపై రూపొందించిన ‘దివిసీమ గాంధీ’ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పురస్కార విజేత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించి, మాట్లాడారు. రాజకీయ విభేదాలకు, పరిపాలనా వ్యవహారాలకు, భాషాప్రేమకు మధ్య స్పష్టమైన అంతరాన్ని పాటిస్తూ, అన్ని రంగాలలోనూ అందరినీ మెప్పించిన ఘనత కృష్ణారావుదేనని కొనియాడారు. ఎమెస్కో విజయకుమార్ మాట్లాడుతూ... ప్రామాణికమైన తెలుగు మీద పట్టుండేలా భావితరాలలో కొందరినైనా తయారుచేసే బాధ్యత నేటి తరపు తెలుగు ప్రేమికులదేనన్నారు. ‘
తానా’ సాహిత్యవేదిక అధ్యక్షులు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ... మండలి వెంకట కృష్ణారావు జీవితాన్ని పాఠశాల స్థాయిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని సూచించారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు ఆళ్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... నాగరికత, సాంకేతికత ఎంత పెరిగినా పుస్తకం విలువ, పుస్తకం ద్వారా వచ్చే జ్ఞానం విలువ మారవన్నారు. డీఆర్‌డీవో మాజీ చైర్మన్ సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ...మాతృభాషలో చదవడం వల్ల బుద్ధి సహజంగా వికసిస్తుందని, దానివల్లనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ... పుస్తక మహోత్సవం పుస్తకాలను పాఠకులకు చేర్చేందుకు పరిమితం కాకుండా.. అనేక మంది చదువరులు, ఆలోచనాపరులు ఒకరితో మరొకరు కలిసేందుకు, చర్చించేందుకు సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. సీపీఏం మాజీ ఎంపీ మధు మాట్లాడుతూ, ప్రజా సేవ, భాషాసేవ రెండూ నిర్వహించిన సవ్యసాచి మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ... దివిసీమ ఉప్పెన సమయంలో మండలి వెంకట కృష్ణారావు సేవలను శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, హైదరాబాద్ పుస్తక మహోత్సవ కార్యదర్శి వాసు, వెబ్ జర్నలిస్టు కిరణ్ ప్రభ, తెలుగు ఎన్నారై డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజా, విజయవాడ పుస్తక మహోత్సవ సంఘ బాధ్యులు మనోహర నాయుడు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో.. ‘మాదక ద్రవ్యాలు వద్దు - పుస్తకాలే ముద్దు’ అనే ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు.