Bomb Threats: జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:02 AM
రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు
విశాఖ, ఏలూరు, అనంతపురం, చిత్తూరుల్లో కలకలం
తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కోర్టుల్లోనూ సోదాలు
అన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని నిర్ధారణ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్):
రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఉత్తుత్తి బెదిరింపులేనని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల పాటు కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. విశాఖ జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజుకు గురువారం ఈమెయిల్ పంపించారు. ఆయన నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చికి తెలియజేయడంతో బాంబు స్క్వాడ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లతో కోర్టు ఆవరణలోనూ, హాళ్లలోనూ తనిఖీ చేశారు. పార్కింగ్‌లో ఉన్న వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ కూడా వచ్చింది. ఎక్కడా బాంబు లేదని తేలింది. కోర్టు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. ఇక చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని, మధ్యాహ్నం 1.15 గంటలకు పేలుడు పదార్థాలతో ధ్వంసం చేస్తామంటూ గురువారం మధ్యాహ్నం 12.20 గంటలకు Vikramrajagaru@outlook.com ఐడీ నుంచి జిల్లా కోర్టు సూపరింటెండెంట్‌కు మెయిల్ వచ్చింది. వెంటనే ఎస్పీ తుషార్ డూడీకి సమాచారమివ్వడంతో ఆయన నాలుగు బృందాలను కోర్టు వద్దకు పంపారు. వారు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బందిని బయటకు పంపించి సుమారు ఐదు గంటల పాటు తనిఖీలు చేసి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు ఏమీ లేవని తేల్చారు. ఈ బెదిరింపు నేపథ్యంలోనే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని అన్ని కోర్టుల్లోనూ పోలీసులు తనిఖీ చేశారు. అలాగే, ఈలం పీపుల్స్ రివల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన అజ్మల్ అబ్దుల్లా పేరు మీద ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవికి గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు మెయిల్ వచ్చింది.
జిల్లా కోర్టులోని న్యాయమూర్తుల చాంబర్స్‌లో మూడు చోట్ల ఆర్డీఎక్స్ అమర్చామని, 1.35 గంటలకు ఎల్‌ఈడీ(లైట్ ఇమెటింగ్ డయోట్)తో వాటిని పేల్చి వేస్తామని పేర్కొన్నారు. ఆమె జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్‌కు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఉన్నవారందరూ వెంటనే బయటికి వెళ్లిపోవాలని మైక్‌లో ప్రచారం చేయించారు. న్యాయమూర్తులు కూడా బయటకు వచ్చి చెట్టు కింద నిల్చున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించి ఏమీ లేదని తేల్చారు. అలాగే, తమిళ లిబరేషన్ ఆర్గనైజేషన్(టీఎల్‌ఓ)కు చెందిన మహ్మద్ అస్లాం విక్రం పేరిట అనంతపురం జిల్లా కోర్టుకు బుధవారం రాత్రి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కశ్మీర్ ఐఎస్ఐ సభ్యులతో కలసి కోర్టు కాంప్లెక్స్‌ను పేల్చేస్తామని, మూడు ఆర్‌డీఎక్స్ బాంబులను కోర్టు కాంప్లెక్స్‌లో పెట్టామని, పేల్చివేస్తామని అందులో హెచ్చరించారు. అవి పేలకపోతే టీఎల్‌ఓ సభ్యులు కోర్టు ప్రాంగణంలోకి వచ్చి శ్రీలంక ఈస్టర్ దాడుల తరహాలో న్యాయాధికారులు, న్యాయవాదులను పేలుస్తారని బెదిరించారు. దీంతో అందరూ కోర్టును ఖాళీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి భీమారావు మైక్ ద్వారా ప్రచారం చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఉత్తుత్తి బెదిరింపులేనని తేలడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోర్టు కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.