Share News

జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:45 AM

కృష్ణా, చిత్తూరు జిల్లా కోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో కలకలం రేగింది. మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ఆవరణలో 13 న్యాయస్థానాలు ఉన్నాయి.

జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు

  • తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీపై సీబీఐ కేసు ఉపసంహరణకు డిమాండ్‌

మచిలీపట్నం టౌన్‌/చిత్తూరు లీగల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, చిత్తూరు జిల్లా కోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడంతో కలకలం రేగింది. మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ఆవరణలో 13 న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టుల ఆవరణలో బాంబు ఉందని జిల్లా న్యాయాధికారికి ఒక మెయిల్‌ వచ్చింది. జిల్లా జడ్జి గోపీ వెంటనే ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడుకు ఫిర్యాదు చేయడంతో చిలకలపూడి సీఐ నబీ సిబ్బందితో కలిసి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముమ్మరంగా తనిఖీలు జరిపారు. విషయం తెలుసుకున్న న్యాయవాదులు, న్యాయాధికారులు న్యాయస్థానాల నుంచి బయటకు వచ్చేశారు. కాగా.. పోలీసుల తనిఖీల్లో ఎక్కడా బాంబు కనిపించలేదు. అటు.. చిత్తూరు కోర్టుకు ఆదివారం మరోసారి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. సోమవారం ఉదయం 8.44 గంటలకు కోర్టు సిబ్బంది బయటకు వెళ్ళిపోవాలని 25 చిన్న బాంబులతో కోర్టును పేల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్‌ పంపించారు. తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని మెయిల్‌లో డిమాం డ్‌ చేశారు. జిల్లా న్యాయాధికారి అరుణసారిక సహచర న్యాయాధికారులకు, న్యాయవాదులకు, సిబ్బందికి, జిల్లా పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. కోర్టు పరిసరాల్లో డాగ్‌, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది పరిశీలించి, బాంబు లేదని నిర్ధారించారు.


అగనంపూడి రవాణా శాఖ కార్యాలయానికీ..

అగనంపూడి(విశాఖపట్నం), మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగర సమీపంలోని అగనంపూడి రవాణా శాఖ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామంటూ ఓ ఆజ్ఞాత వ్యక్తి నుంచి సోమవారం ఈమెయిల్‌ వచ్చింది. కార్యాలయాన్ని పేల్చివేసేందుకు 15 చిన్న బాంబులు సిద్ధంగా ఉన్నాయని, తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీపై ఉన్న సీబీఐ కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే కార్యాలయాన్ని పేల్చేస్తామని మెయిల్‌లో బెదిరించారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఉత్తుత్తి బెదిరింపుగా తేల్చారు. ఈ మెయిల్‌ చెన్నై నుంచి వచ్చినట్టు గుర్తించారు.

Updated Date - Mar 24 , 2026 | 04:48 AM