అమెరికాలో బొబ్బిలి యువకుడి విషాదాంతం
ABN , Publish Date - Apr 13 , 2026 | 06:23 AM
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) శనివారం సాయంత్రం అమెరికాలోని ఓ నదిలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు.
నదిలో ఈతకు దిగి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
పుట్టినరోజు నాడు.. స్నేహితులు చూస్తుండగానే ఘోరం
బొబ్బిలి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) శనివారం సాయంత్రం అమెరికాలోని ఓ నదిలో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సింగిరెడ్డి శ్రీనివాసరావు, రమకు కుమార్తె సాయిప్రసన్న, కుమారుడు సాయిశ్రీ హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేశాక 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. 4 నెలల కిందటే ఎలిసెంట్ క్లీన్స్ టెక్నాలజీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో శనివారం పుట్టిన రోజు సందర్భంగా హరికృష్ణ ఐదుగురు స్నేహితులతో కలిసి మెరమెక్ స్టేట్‌పార్కు సమీపంలోని నది వద్దకు వెళ్లారు. మిగతా స్నేహితులు ఒడ్డున ఉండగా, హరికృష్ణ నదిలో దిగారు. ఈదుకుంటూ కొద్దిదూరం వెళ్లాక నీటిలోని చెట్టు వేళ్లలో ఇరుక్కుని ఉన్నఫలంగా మునిగిపోయారు. రెస్క్యూ సిబ్బంది వచ్చేసరికే హరికృష్ణ విగతజీవిగా మారాడు. కాగా, హరికృష్ణ తండ్రి ఆటో నడుపుతుంటారు. తల్లి రమ స్థానిక పీహెచ్‌సీలో కాంట్రాక్టు ఉద్యోగి. అందివచ్చిన కుమారుడి మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణ మృతి తమను తీవ్రంగా కలచి వేసిందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు తెలిపారు.