Share News

Konaseema: మంటలు తగ్గుముఖం..

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:18 AM

మూడు రోజుల క్రితం కోనసీమలో చెలరేగిన ‘బ్లో ఔట్‌’ మంటలు తగ్గుముఖం పడుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం...

Konaseema: మంటలు తగ్గుముఖం..

  • బ్లోఔట్‌ బావి వద్ద తగ్గిన తీవ్రత, శబ్ధం

  • 3 నుంచి 4 మీటర్లకు పరిమితమైన అగ్నికీలలు

  • ప్రత్యేక రోడ్డు ఏర్పాటుతో శకలాల తొలగింపు వేగవంతం

  • ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీహరి బృందం రంగంలోకి

  • బ్లోఔట్‌ పూర్తి అదుపునకు నేటి నుంచి యాక్షన్‌ ప్లాన్‌

  • మూడు వైపుల నుంచి వాటర్‌ అంబ్రెల్లా ద్వారా పంపింగ్‌

  • పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు చేరిన బాధితులు

అమలాపురం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల క్రితం కోనసీమలో చెలరేగిన ‘బ్లో ఔట్‌’ మంటలు తగ్గుముఖం పడుతున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఓఎన్జీసీ మోరి-5 బావిలో డీప్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ సంస్థ డ్రిల్లింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో బ్లోఔట్‌ సంభవించిన సంగతి తెలిసిందే. తొలిరోజు సుమారు వంద అడుగుల వరకూ ఎగసిపడిన మంటల తీవ్రత బుధవారానికి 3 నుంచి 4 మీటర్లకు తగ్గింది. బావి నుంచి వెలువడే శబ్ధం కూడా తగ్గడంతో ఇరుసుమండ సహా సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న 460 మందికిపైగా బాధితులు తమ ఇళ్లకు చేరుకున్నారు.


బావి వద్ద నిపుణుల బృందం సమీక్ష

ఢిల్లీ నుంచి వచ్చిన ఓఎన్జీసీకి చెందిన నిపుణుడు శ్రీహరితోపాటు ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు విక్రమ్‌ సక్సేనా, శాంతనూర్‌దాస్‌ బ్లోఔట్‌ బావి వద్ద పరిస్థితులను సమీక్షించారు. గురువారం నుంచి వెల్‌ క్యాపింగ్‌ ప్రక్రియకు రంగం సిద్ధం చేస్తామని శ్రీహరి వెల్లడించారు. ప్రస్తుతం పొలాల్లో నుంచి పంచాయతీరాజ్‌ అధికారులు డ్రిల్లింగ్‌ సైట్‌ వద్దకు యుద్ధ ప్రాతిపదికన ఒక రహదారిని నిర్మించారు. కుప్పకూలిన రిగ్‌ శకలాల (డెబ్రిస్)ను ఆ రోడ్డు నుంచి తొలగించే పనిలో ఓఎన్జీసీ సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రమాదం జరిగిన సైట్‌ చుట్టూ రెండు భారీ చెరువులను తవ్వి, పంటకాల్వ నుంచి నీటిని అక్కడకు మళ్లించి భారీ ఫైర్‌ ఫైటింగ్‌ అంబ్రెల్లాల ద్వారా నీటిని మంటలపైకి వెదజల్లుతున్నారు. ప్రస్తుతం మూడు వైపుల నుంచి నీటితోపాటు కెమికల్స్‌తో కూడిన మడ్‌ పంపింగ్‌ చేపట్టారు. దీంతో మంటలు నియంత్రణలోకి వస్తున్నాయి. ఓఎన్జీసీ నిపుణులను సంప్రదించిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి సంఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. చుట్టూ ఉన్న డెబ్రిస్ తొలగించిన తర్వాత నిపుణుల బృందం వెల్‌ మౌత్‌ను కూడా పరిశీలించనుంది. బావిని మూసివేసే సమయంలో గ్యాస్‌ ప్రజెర్‌ను కట్టడి చేసేందుకు స్ల్కమ్‌ బ్లడ్జర్‌ వాహనాలతో ప్రత్యేక నిపుణుల బృందం సైట్‌ వద్దే ఉంది. మడ్‌ పంపింగ్‌ ద్వారా గ్యాస్‌ నియంత్రణను అరికట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నరసాపురం సహా వివిధ ప్రాంతాల నుంచి భారీ పరికరాలు ఇరుసుమండకు చేరుకుంటున్నాయి.


కాగా, అమలాపురంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆర్‌.మహే్‌షకుమార్‌ అధ్యక్షతన రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌, ఓఎన్జీసీ డైరెక్టర్లు బ్లోఔట్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిపుణుల బృందాలు మంటల నియంత్రణ చర్యలు కొనసాగిస్తున్నారని కలెక్టర్‌ మహే్‌షకుమార్‌ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇరుసుమండ సహా మూడు గ్రామాల ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యారని అన్నారు. నిపుణుల బృందంతో చర్చించి గురువారం నుంచి యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు చర్యలు తీసుంటామన్నారు. కాగా, బ్లోఔట్‌ సైట్‌ వద్ద స్థానికులు ‘ఓఎన్జీసీ గోబ్యాక్‌’ అంటూ కాసేపు ఆందోళన చేపట్టారు.

Updated Date - Jan 08 , 2026 | 04:19 AM