P.V.N. Madhav: నీటి వాటాలపై రాజీలేని పోరు
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:42 AM
ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు, హక్కులపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఎక్కువ నిధులు అక్కర్లేకుండానేఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తి: మాధవ్
ప్రతి సోమవారం ‘జనతా వారధి’
విశాఖపట్నం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు, హక్కులపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. మంగళవారం విశాఖలో ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ నదుల్లో రాష్ట్ర నీటి వాటాల విషయంలో బీజేపీ తప్పనిసరిగా తన పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు వివక్షకు గురయ్యాయన్నారు. పోలవరం జీవనాడి ప్రాజెక్టు అని, గోదావరి నీరు శ్రీకాకుళం జిల్లాలోని వంశధారలో కలపాలనే లక్ష్యం కోసం పోరాటం చేస్తుందని చెప్పారు. విశాఖపట్నానికి భారీ పరిశ్రమలు వస్తున్నందున నీటి అవసరం చాలా ఉందని.. పోలవరం ఎడమ కాలువ పనులు త్వరితంగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1, ఫేజ్-2 పనులపై కూడా దృష్టి పెడతామని.. ఎక్కువ నిధులు అవసరం లేకుండానే ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసే అవకాశం ఉందని చెప్పారు. రాయలసీమకు 200 టీఎంసీల నీరు కావాలని, అక్కడ కూడా భారీ పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. కృష్ణా నది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కువ నీటిని వాడుకుంటున్నాయని, మిగులు జలా ల్లో ఏపీకి వాటా ఇవ్వాల్సి ఉందన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం తామే నిర్మించామంటూ జగన్ ప్రచా రం చేసుకోవడంపై స్పందిస్తూ.. అది ఎవరి ఆలోచన వల్ల అంకురార్పణ జరిగిందో, ఎవరు భూసేకరణ చేసి, శంకుస్థాపన చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 2014-19 మధ్య ఎన్‌డీఏ ప్రభుత్వంలోనే అది వచ్చిందని స్పష్టంచేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య ప్రస్తు త సంబంధాల నేపథ్యంలో గూగుల్ విశాఖలో పెట్టుబడులు పెట్టకుండా అమెరికా ఒత్తిడి చేస్తోందా అని అడుగగా.. అది వాస్తవమేనని.. కాకపోతే గూగుల్ డేటా సెంటర్ అవసరాలు భారత్ కంటే అమెరికాకే ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాజెక్టు ఆగదని మాధవ్ స్పష్టంచేశారు. ప్రజల సమస్యలు మరింత త్వరితం గా పరిష్కారం కావడానికి బీజేపీ ప్రతి సోమవారం ‘జనతా వారధి’ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పా రు. కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాలకు బీజేపీ కార్యకర్తలు వెళ్లి ప్రజల సమస్యలపై అర్జీలు అందిస్తారన్నారు. ఈ నెల 9న విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడల్లో బీజేపీ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ‘వారధి’ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని.. ఇది ప్రతి శుక్రవారం ఉంటుందని తెలిపారు.