భారత్ పరువు తీసేలా కాంగ్రెస్ తీరు
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:10 AM
ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టడంపై బీజేపీ మండిపడింది.
రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు
కోడిగుడ్లు, టమోటాలు విసిరిన బీజేపీ, బీజేవైఎం నాయకులు
రాహుల్ దిష్టిబొమ్మ, కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలు దహనం
కర్నూలు అర్బన్/గుంటూరు/విజయనగరం క్రైం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టడంపై బీజేపీ మండిపడింది. ప్రపంచ దేశాల ప్రతినిధుల ఎదుట భారత్ పరువు తీసేలా కాంగ్రెస్ వ్యవహరించటం సిగ్గు సిగ్గు.. అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్రంలోని పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై బీజేపీ, బీజేవైఎం, వీహెచ్‌పీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లు విసిరి ఆందోళనలు చేశారు. కర్నూలులోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడుల కోసం ప్రధాని మోదీ ఢిల్లీలో సమ్మిట్ చేస్తే.. కాంగ్రెస్ శ్రేణులు అరాచకం సృష్టించారని మండిపడ్డారు. దేశాభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఆందోళనకారులు చింపివేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గుంటూరులో ఉద్రిక్తత
బీజేవైఎం కార్యకర్తలు కొందరు గుంటూరులో కాంగ్రెస్ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యాలయంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేవైఎం కార్యకర్తలపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయటంతో పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలు అక్కడున్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించి, కాల్చివేసి నిరసన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యేలు షేక్ మస్తాన్‌వలి, లింగంశెట్టి ఈశ్వరరావు ఎస్పీ వకుల్ జిందాల్‌ను కలిసి కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
విజయనగరంలో 20 మందిపై కేసు నమోదు
విజయనగరంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఆ పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను బీజెపీ కార్యకర్తలు ధ్వంసం చేసి, దహనం చేశారు. బీజెపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ ఏఐ సమ్మిట్‌లోకి కాంగ్రెస్ యూత్ నాయకులు ఉగ్రవాదుల్లా ప్రవేశించి నిరసన తెలియజేయడం తగదన్నారు. 20 మంది బీజేపీ నాయకులపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి తెలిపారు.
ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ తీరు
దురదృష్టకరం: లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ సృష్టించిన ఆటంకాలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ ఏఐ సూపర్ పవర్‌గా సత్తా చాటేందుకు భారతదేశం ఏర్పరుచుకున్న అంతర్జాతీయ వేదికపై యూత్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని లోకేశ్ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికను రాజకీయ డ్రామాకు వేదికగా మార్చేందుకు ప్రయత్నించడం దురదృష్టకరం. వినూత్న ఆవిష్కరణలతో దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెట్టేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.

మోదీ పాలనలోనే దళిత సంక్షేమం: మాధవ్
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ పాలనలోనే దళిత సంక్షేమానికి పెద్దపీట పడింది. రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపదీ ముర్ము లాంటి వారిని దేశ అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఏపీ బీజేపీ ఎస్‌సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం విజయవాడలో ఎస్‌సీ మోర్చా అధ్యక్షుడు పనతల సురేశ్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాధవ్ మాట్లాడుతూ... ‘కాంగ్రెస్ పార్టీ దళితుల్ని ఓటు బ్యాంకుగానే చూసింది. నరేంద్ర మోదీ దళిత, గిరిజనుల సంక్షేమంతో పాటు కేంద్ర మంత్రి వర్గంలో వారికి పెద్ద పీట వేశారు’ అని అన్నారు. ఎస్‌సీ మోర్చా జాతీ య అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య మాట్లాడుతూ... ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నంత వరకూ రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు లేదు. రాహుల్ గాంధీ విదేశాల్లో భారత పరువు తీసేందుకు ప్రయత్నిస్తే యువజన కాంగ్రెస్ ఢిల్లీలో అంతర్జాతీయ ఏఐ సదస్సు జరిగే సమయంలో అదే చర్యకు పాల్పడటం హేయం’ అని మండిపడ్డారు.