బీజేపీతోనే డప్పు కళాకారులకు న్యాయం
ABN , Publish Date - May 18 , 2026 | 06:20 AM
భారతీ య సంస్కృతిని చాటి చెప్పేది డప్పు కళాకారులేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని..
40 ఏళ్లు దాటిన వారికి పింఛన్.. ఇంటి స్థలం ఇస్తాం
మంత్రి సత్యకుమార్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్
విజయవాడలో భారీ ర్యాలీ..
విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): భారతీ య సంస్కృతిని చాటి చెప్పేది డప్పు కళాకారులేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీస్టేడియం నుంచి అంబేడ్కర్ స్మృతివనం వరకు డప్పు కళాకారులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్మృతివనంలో జరిగిన సభలో మంత్రి మా ట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. అంబేడ్కర్ రెండుసార్లు ఎంపీగా పోటీ చేస్తే అప్పటి ప్రధాని నెహ్రూ ఓడించారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్.. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ డప్పు కళాకారులకు గుర్తింపు ఇస్తామన్నారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చడమంటే ఆయన విగ్రహానికి దండలు వేయడం మాత్రమే కాదన్నారు. కూటమి ప్రభుత్వం డప్పు కళాకారులను అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. 40 ఏళ్లు దాటిన డప్పు కళాకారులకు పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పంచాయతీలో డప్పు కళాకారుడికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదిస్తామన్నారు. దేవాలయ వ్యవస్థలో డప్పు, సన్నాయి పెట్టేలా చూస్తామన్నారు. బాగా చదువుకోవడమే అంబేడ్కర్‌కు ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. డప్పు కళాకారులు బీజేపీతో కలిసి నడిస్తే వారి జీవితాలను మారుస్తామని మాధవ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.