ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించే బాధ్యత మనదే
ABN , Publish Date - Feb 01 , 2026 | 04:05 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కేడర్ సేవకు నడుంబిగించాలి.
పార్టీ నేతలు, కార్యకర్తలకు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ నిర్దేశం
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కేడర్ సేవకు నడుంబిగించాలి. ఏ పథకానికి ఎవరు అర్హులు? ఆయా పథకాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అన్న విషయాలను వివరించాలి. వాటిని తామే పూర్తి చేసి తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ పరిష్కారం అయ్యేలా చూడాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ ముఖ్య నేతల భేటీలో వ్యాఖ్యానించారు. నెల రోజుల పాటు బీజేపీ శ్రేణులు తమ గ్రామ, వార్డుల్లో ప్రజల్ని సంప్రదించి సేవ చేసే కార్యక్రమాన్ని ‘చేరువ’ పేరుతో బీజేపీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. ‘మా ఊరు... మా జెండా’ పేరుతో ప్రతి గ్రామం, వార్డులో బీజేపీ జెండాలు ఆవిష్కరించి.. అక్కడి దిమ్మకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారు. గ్రామస్తులు ఎవరైనా మొబైల్‌లో ఆ కోడ్ స్కాన్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ఆ గ్రామ, వార్డు అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులతో పాటు సంక్షేమ ఫలాల వివరాలు కనిపిస్తాయి.’ అని మాధవ్ తెలిపారు.