కొత్త ఓటర్లను చేర్పించడంలో పోటీపడాలి
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:39 AM
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) కార్యక్రమాన్ని ప్రతి బీజేపీ కార్యకర్తా అత్యంత బాధ్యతగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.
‘సర్’ను బాధ్యతగా తీసుకోవాలి
శ్రేణులకు బీజేపీ నాయకత్వం నిర్దేశం
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) కార్యక్రమాన్ని ప్రతి బీజేపీ కార్యకర్తా అత్యంత బాధ్యతగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోనూ కొత్త ఓటర్లను నమోదు చేయించడంలో పరస్పరం పోటీ పడాలని సూచించింది. రాష్ట్రంలో త్వరలో ఓటర్ల జాబితా సవరణ జరగనున్న నేపథ్యంలో బీజేపీ తన శ్రేణులకు ఆదివారం విజయవాడలో అవగాహన సమావేశం నిర్వహించింది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, కేంద్ర పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ, ఎంపీ పురందేశ్వరి తదితరులు కీలక సూచనలు చేశారు. బూత్ స్థాయి పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలన్నారు. ఓటర్ల నుంచి వివరాలు నమోదు చేసుకుని ఫొటోతో పాటు అవసరమైన పత్రాలను బూత్ స్థాయి అధికారు(బీఎల్‌వో)లకు అందజేయాలని చెప్పారు. సర్ ప్రక్రియతో పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున బంగ్లాదేశీయులు బయటపడ్డారని.. ఈ నేపథ్యంలో ఎక్కడ అనుమానం వచ్చినా పౌరసత్వానికి సంబంధించిన పత్రాలు పరిశీలించేలా జాగ్రత్త పడాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు, కొత్తగా చేర్పించేవారి వివరాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాడానికి రాష్ట్ర స్థాయిలో పార్టీ తరపున ప్రత్యేక కమిటీ, జిల్లాల వారీగా పర్యవేక్షకులను నియమించనున్నట్లు మాధవ్ వెల్లడించారు.