ఆర్థిక నేరాల కేసులో బీజేపీ నేతలు అరెస్టు
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:30 AM
ఫైనాన్షియర్లను మోసగించిన కేసులో బీజేపీ నాయకురాలు సుమతి సురతాని, ఆమె భర్త వల్లెపు శ్రీనివాసులును అనంతపురం జిల్లా పోలీసులు...
రిమాండ్‌కు సుమతి, శ్రీనివాసులు దంపతులు
దేశంలోని పలు రాష్ట్రాల్లో వీరిపై కేసులు నమోదు
100 కోట్ల దాకా మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు
అనంతపురం క్రైం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఫైనాన్షియర్లను మోసగించిన కేసులో బీజేపీ నాయకురాలు సుమతి సురతాని, ఆమె భర్త వల్లెపు శ్రీనివాసులును అనంతపురం జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిపై పలు రాష్ట్రాల్లో ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. ఏపీ, కర్ణాటక, కేరళ, నోయిడా, ముంబై తదితర ప్రాంతాల్లో కేసులు ఉన్నట్లు సమాచారం. చెక్ బౌన్స్(ఎన్‌ఐ) కేసుల్లో వీరిని అరెస్టు చేసినట్లు అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు ప్రకటించారు. అనంతపురానికి చెందిన ఈ దంపతులు మొదట చిన్న మొత్తంలో ఫైనాన్షియర్ల నుంచి డబ్బులు తీసుకున్నారు. వాటిని వడ్డీతో చెల్లించడం ద్వారా ఫైనాన్షియర్ల నమ్మకం పొందిన తర్వాత పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి తమకు ఆర్డర్లు ఉన్నాయంటూ ఫైనాన్షియర్ల నుంచి చిన్నమొత్తంలో అప్పులు తీసుకున్నట్టు ఫిర్యాదులు అందాయి. వాటిని వెంటనే చెల్లించేసి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని, తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరిగేవారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారిపై పలు రాష్ట్రాలలో సివిల్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనూ విజయవాడ, అనంతపురంలలో కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రూ.100 కోట్లకుపైగా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.