వైసీపీ పాలనంతా అరాచకమే
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:48 AM
‘‘వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడైనా చేశారా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశ్నించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తప్ప రెండో ఫ్లోర్ నిర్మాణం ఎక్కడైనా జరిగిందా? అని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై అన్న, చెల్లెలు దుష్ప్రచారం: మాధవ్
తిరుపతి సిటీ, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడైనా చేశారా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశ్నించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తప్ప రెండో ఫ్లోర్ నిర్మాణం ఎక్కడైనా జరిగిందా? అని అన్నారు. గడిచిన రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూడాలంటే రాష్ట్రమంతా తిరిగి చూడాలని వ్యాఖ్యానించారు. తిరుపతిలో నిర్వహించిన ఎన్డీయే విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
తప్పుదోవ పట్టించే ప్రయత్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై కొన్ని దుష్టశక్తులు అనేక రకాలుగా మాట్లాడుతున్నాయి. అన్న, చెల్లెమ్మలు (జగన్, షర్మిల) స్టీల్ ప్లాంట్‌కు వచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అన్నిరకాల పరిహారాలు ఇచ్చాం. ప్రమాదం అనంతరం వారు మాట్లాడిన తీరు సరైంది కాదు. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వని నిధులు (రూ.11,414 కోట్లు) ఇచ్చారు. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు. మన అభివృద్ధి వాళ్లకు(వైసీపీ) కనబడలేదు కాబట్టి వారిని రాష్ట్ర వ్యాప్తంగా తిరగమని చెబుతున్నాం.
పునరంకితమవుదాం
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 12 ఏళ్లు, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రస్తుతం రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి ప్రపంచమే ఆశ్చర్యపోయేలా పెట్టుబడులు వచ్చాయి. సుమారు రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రపంచంలో స్టీల్ ప్లాంట్లలో మొదటి రెండు స్థానాల్లోని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ జాయింట్ వెంచర్‌తో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ త్వరలో రానుంది. ప్రపంచానికే ఆదర్శంగా ఉంటూ సుమారు రూ.2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటుతో రెన్యువల్ ఎనర్జీ క్యాపిటల్‌గా నిలవనుంది. ఫైటర్ జెట్ నిర్మాణ సంస్థ రాయలసీమకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు భుజం, భుజం కలిపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేశారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపదలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, చంద్రబాబు నేతృత్వంలో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం. రాష్ట్రానికి సంపద సృష్టిలో, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. సూపర్ సిక్స్‌తోపాటు ప్రతి ఇంటికీ నీటి కొళాయి, ఎల్‌ఈడీ లైట్లు, మరుగుదొడ్లు, గ్యాస్, తదితర సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రధాని, ముఖ్యమంత్రి గురించి రాష్ట్రంలోని ప్రతిగడపకూ వెళ్లి డబుల్ ఇంజన్ సర్కార్ గురించి చెప్పాలి. ప్రజా సేవలో పునరంకితమవుదాం అన్నారు.