Share News

ఉమ్మడిగా తిప్పికొడదాం

ABN , Publish Date - Mar 04 , 2026 | 03:06 AM

‘అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు.. ఇప్పుడు మనం అన్ని విధాలా బాగు చేస్తుంటే కుట్రలు చేస్తున్నారు..

ఉమ్మడిగా తిప్పికొడదాం

  • లడ్డూ వ్యవహారంపై సీఎంతో బీజేపీ నేత మాధవ్‌ భేటీ

  • వైసీపీపై ఎదురుదాడికి వ్యూహం సిద్ధం

అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు.. ఇప్పుడు మనం అన్ని విధాలా బాగు చేస్తుంటే కుట్రలు చేస్తున్నారు.. తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీతో హిందువుల ఆగ్రహానికి గురయ్యారు.. అందులో అసలు నెయ్యే లేదని సీబీఐ సిట్‌ తేలిస్తే.. మనం క్షమాపణ చెప్పాలంటూ పోస్టర్లు వేసి రెచ్చగొడుతున్నారు’ అని సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మాధవ్‌ ఉండవల్లిలో సీఎంతో భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏకతాటిపై నిలిచి.. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఎదురుదాడి వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ‘అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తో తిట్టించేదీ వాళ్లే. మనం సంయమనం పాటించి చట్ట పరంగా చర్య తీసుకుంటే కులం కార్డు తీసేదీ వాళ్లే.. ఇప్పుడు మహిళల పరువు తీసేలా ఫేక్‌ వీడియోలు సృష్టించి సోషల్‌ మీడియాలో వదులుతున్నారు.. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పకుంటే రాష్ట్రంలో కుల, మత చిచ్చులు రేపుతారు.. ముగ్గురం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.. సైకో పార్టీ కుట్రలనూ ఉమ్మడిగా తిప్పికొడదాం..’ అని నిశ్చయించినట్లు తెలిసింది. చంద్రబాబు ఉదయం ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో జరిపిన సమావేశంలోనూ లడ్డూ అంశంపై చర్చించారు. శాసనమండలిలో బుధవారం దీనిపై జరిగే చర్చలో వైసీపీ వాదనను తిప్పికొట్టాలని నిశ్చయించారు.

బీజేపీ సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మాధవ్‌

బీజేపీ మూల సిద్ధాంతాన్ని, నరేంద్ర మోదీ పాలనలో విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జోనల్‌ వారీగా నిర్వహించిన ప్రశిక్షణా తరగతులు ముగిశాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ప్రశిక్షణా తరగతులు నిర్వహించి బీజేపీ మూల సిద్ధాంతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని మాధవ్‌ దిశా నిర్దేశం చేశారు.

Updated Date - Mar 04 , 2026 | 03:13 AM