Share News

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - May 24 , 2026 | 04:45 AM

‘డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అది చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్‌తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆరోపించారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రాభివృద్ధి

  • 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాక

  • ఓర్వలేక జగన్‌ తప్పుడు ప్రచారం

  • పార్టీ శ్రేణులు తిప్పి కొట్టాలి: మాధవ్‌

అమలాపురం రూరల్‌, మే 23(ఆంధ్రజ్యోతి): ‘డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అది చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్‌తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆరోపించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల ప్రాంగణంలో శనివారం పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌ 2026 కార్యక్రమం జరిగింది. దానిని ప్రారంభించిన మాధవ్‌ మాట్లాడారు. ‘వైసీపీ తప్పుడు ప్రచారాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ హయాంలో రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్‌, తైవాన్‌కు చెందిన చిప్‌ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుండడంతో వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పుట్టపర్తిలో విమానాలు, డ్రోన్ల తయారీకి సంబంధించిన డిఫెన్స్‌ క్లస్టర్‌ను ప్రారంభించడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం. రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులతో రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేయడమేమిటని జగన్‌ లాంటి నాయకులు ఆలోచనలో పడ్డారు. 75 ఏళ్ల క్రితం శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ మొదటి సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ పార్టీ తరఫున మూడు శాతం ఓట్లు సాధించారు. బెంగాల్‌ నుంచి తొలిసారిగా ప్రాతినిధ్యం వహించారు. ఏ ప్రాంతం నుంచి తొలిసారిగా పార్లమెంటుకు వెళ్లారో ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణులు చేసిన కృషి అభినందనీయం. ముస్లింలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో సైతం బీజేపీ విజయం సాధించింది. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి’ అని మాధవ్‌ పిలుపునిచ్చారు.. ప్రారంభోత్సవ సభలో 20సూత్రాల కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 04:46 AM