Share News

నెయ్యి కల్తీలో వైసీపీ దుష్ప్రచారం

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:01 AM

నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించేందుకు బూతులతో రాజకీయం చేస్తోందని బీజేపీ లెజిస్లేటివ్‌ సమావేశం ...

నెయ్యి కల్తీలో వైసీపీ దుష్ప్రచారం

  • ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించం: మాధవ్‌

  • మోదీ, బాబు కృషితో ఏపీలో పెట్టుబడులు: బీజేఎల్‌పీ

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించేందుకు బూతులతో రాజకీయం చేస్తోందని బీజేపీ లెజిస్లేటివ్‌ సమావేశం విమర్శించింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా విజయవాడలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో మంగళవారం బీజేఎల్‌పీ సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్‌, పార్టీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌ రాజు, సుజనా చౌదరి, పార్థసారఽథి, నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి, ఎన్‌. ఈశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పోతుల సునీత పాల్గొన్నారు. అసెంబ్లీ, మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌తో కలసి కార్యాచరణ రూపొందించారు. సమావేశం అనంతరం మాధవ్‌ విలేకరులతో మాట్లాడుతూ... ‘జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. పార్టీతో వాటికి ఎలాంటి సంబంధం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్యేని వివరణ కోరాం’ అని చెప్పారు.

ప్రాస కోసమే ఆ వ్యాఖ్య: ఆదినారాయణరెడ్డి

సాయంత్రం మాధవ్‌ను కలిసిన అనంతరం ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘కమల వికాసంపై ప్రాస కోసమే కమ్మగా ఉందనే వ్యాఖ్యలు చేశా. కూటమి బలంగా ఉండాలని, వైసీపీ కొవ్వు కరిగించాలని కోరుకునే వ్యక్తిగా కులాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయబోను. జగన్‌ నుంచి నాకు, వివేకా కుమార్తె సునీతకు ప్రాణహాని ఉంది. నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నా’ అని వివరణ ఇచ్చారు.

Updated Date - Feb 11 , 2026 | 04:01 AM