Share News

భరతమాత సేవలో బీజేపీ: మాధవ్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:02 AM

‘ఒకే దేశం... ఒకే ప్రజ... ఒకే చట్టం... లక్ష్యంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, భరత మాత సేవలో నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

భరతమాత సేవలో బీజేపీ: మాధవ్‌

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘ఒకే దేశం... ఒకే ప్రజ... ఒకే చట్టం... లక్ష్యంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, భరత మాత సేవలో నాలుగున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జి, అటల్‌ బిహారీ వాజపేయి నుంచి నరేంద్ర మోదీ, నితిన్‌ నబీన్‌ వరకూ దేశ రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికారని కొనియాడారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం(ఏప్రిల్‌ 6) సందర్భంగా విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో కలసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడారు. ‘వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం. పార్టీ కన్నా దేశం ముఖ్యం. ఈ నినాదంతో మొదలైన ప్రయాణం 46 ఏళ్లలో కోట్లాది మందికి చేరువైంది. జాతీయ వాదమే పునాదిగా నిర్మితమైన బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది’ అని మాధవ్‌ దిశా నిర్దేశం చేశారు. ‘మన ఊరు - మన జెండా’ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో మాధవ్‌ ప్రారంభించారు.


చంద్రబాబు శుభాకాంక్షలు

‘జాతీయవాదమే పునాదిగా, దేశ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడిన పార్టీ బీజేపీ. మన సంస్కృతిని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూ సమగ్ర అభివృద్ధి, దేశ సేవ కోసం నిరంతరం కృషి చేస్తోంది’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘పార్టీ వ్యవస్థాపక నేతల నుంచి మాజీ ప్రధాని వాజపేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తన నిర్ణయాత్మక పాలన, ప్రగతి పట్ల ఉన్న నిబద్ధతతో దేశాన్ని శక్తివంతం చేసింది.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌ మరో ప్రకటనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


దేశం, ప్రజల పట్ల అంకిత భావమే సిద్ధాంతం: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ... భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి, ఆ పార్టీ ముఖ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకిత భావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా ముందుకు వెళ్తోంది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌కే ఆడ్వాణీ లాంటి మహానీయుల సంకల్పం, ప్రధాని మోదీ అచంచల విశ్వాసంతో కూడిన పోరాటంతో నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా కీర్తిని ఆర్జించింది’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 05:02 AM