BJP AP State President P.V.N. Madhav: రాష్ట్రంలో త్వరలో సంచలనాలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:48 AM
‘త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు జరగబోతున్నాయి. వైసీసీ పాలనలో లిక్కర్ అవినీతి ఒక్కటే కాదు... అనేక అరాచకాలు జరిగాయి.
లిక్కర్ ఒక్కటే కాదు... అనేక అరాచకాలు జరిగాయి: మాధవ్
న్యూఢిల్లీ, విజయవాడ సిటీ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ‘త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు జరగబోతున్నాయి. వైసీసీ పాలనలో లిక్కర్ అవినీతి ఒక్కటే కాదు... అనేక అరాచకాలు జరిగాయి. వాటిని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది. రాబోయే కాలంలో ఇంకా వైసీపీ అరాచకాలు బయటకు వచ్చే అవకాశం ఉంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సోమవారం, ఏపీ భవన్‌లో పలువురు నేతలతో కలసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రస్తుతం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న యువ నాయకుడు నితిన్ నబిన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా బలపరుస్తున్నాం. ఆయన తరఫున పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏ లక్ష్మణ్ వద్ద రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశాం. బిహార్‌కు చెందిన యువ నాయకుడు నవీన్ నబిన్‌ను జాతీయ అధ్యక్షునిగా ఎంపిక చేయటం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది’ అని మాధవ్ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నేతలు పలువురు పాల్గొన్నారు.
రీ సర్వేను ఆన్‌లైన్ చేయాలి
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వ్యవసాయ భూములను రీ సర్వే చేసి పారదర్శకత కోసం ఆన్‌లైన్ చేయాలని మాధవ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వ్యవసాయ భూముల రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎల్‌పీఎం, విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఆధార్ లింక్ తదితరాల్లో అనేక తప్పులు ఉన్నాయి. దీని కారణంగానే లక్షలాది మంది రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన భూ రీ సర్వే, రెవెన్యూ అవకతవకలపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టాలి. 60 శాతానికి పైగా ఉన్న ఎల్‌పీఎం, సర్వే నెంబర్లు, విస్తీర్ణం, సరిహద్దు సమస్యల పట్ల దృష్టి సారించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది’ అని మాధవ్ పేర్కొన్నారు.