స్థానిక పోరుకు కమలం సన్నద్ధం
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:22 AM
‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలి. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా పార్టీ ఆదేశాల మేరకు బరిలోకి దిగాలి. కూటమితో సమన్వయం చేసుకుని, 100శాతం విజయాలు నమోదు చెయ్యాలి.
కూటమితో సమన్వయం,100శాతం విజయమే లక్ష్యం: మాధవ్
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలి. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా పార్టీ ఆదేశాల మేరకు బరిలోకి దిగాలి. కూటమితో సమన్వయం చేసుకుని, 100శాతం విజయాలు నమోదు చెయ్యాలి. పార్టీ విస్తరణే లక్ష్యంగా కొత్త నాయకత్వం ముందుకు రావాలి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కేడర్‌కు పిలుపునిచ్చారు. విజయవాడలో శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడారు. ’స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎవరిని ఎక్కడ పోటీ చెయ్యమన్నా అందుకు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రానికి కేంద్రం అందిస్తోన్న సహకారాన్ని ప్రజలకు వివరించాలి. పోలవరం-మోదీ వరం అనే నినాదాన్ని బలంగా వినిపించాలి’ అని చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ, ప్రతి కార్యకర్తకు నాయకుడిగా ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమన్నారు. ఎన్నికల బరిలో దిగే వారికి పార్టీ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని జాతీయ కార్యదర్శి రితిరాజ్ సిన్హా చెప్పారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి, పార్థసారథి, ఈశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు పాల్గొన్నారు.