అంతా తారు...మారు!
ABN , Publish Date - May 18 , 2026 | 04:53 AM
రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన తారు (బిటుమెన్) కొరత తీవ్రంగా ఉంది. పశ్చియాసియాలో యుద్ధ ఉద్రిక్తతలతో ముడి చమురుసరఫరా బాగా పడిపోయింది.
యుద్ధంతో రహదారులకు దొరకని తారు.. రాష్ట్రంలో 100 శాతం పెరిగిన ధర
ఫిబ్రవరిలో టన్ను రూ.45 వేలు... ఇప్పుడు రూ.90 వేలు పైనే రేటు
అయినా విశాఖలో లభ్యంకాని వైనం
150 ట్యాంకర్లు వారంగా రోడ్ల పక్కనే..
అధిక ధరకు చెన్నైనుంచి తెస్తున్నాం: ఎస్‌ఈ
(విశాఖపట్నం/మల్కాపురం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైన తారు (బిటుమెన్) కొరత తీవ్రంగా ఉంది. పశ్చియాసియాలో యుద్ధ ఉద్రిక్తతలతో ముడి చమురుసరఫరా బాగా పడిపోయింది. దాంతో పెట్రో ఉత్పత్తులన్నీ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తారు కొరత ఏర్పడింది. ఆయిల్ రిఫైనరీల్లో ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్ తదితర విలువైన ఉత్పత్తులన్నీ తీసేయగా, చివరిగా మిగిలిన బ్లాక్ ఆయిల్‌తో తారు తయారవుతుంది. విశాఖపట్నంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) దీనిని పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తుంది. ఏడాదికి ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యాన్ని ఇటీవలె 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకుంది. అందులో భాగంగా 0.225 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో బిటుమిన్ (తారు) బ్లోయింగ్ యూనిట్ ఏర్పాటుచేసింది. ఉత్తరాంధ్రాతో పాటు రాష్ట్రంలో అనేక జిల్లాలకు ఇక్కడి నుంచే తారు సరఫరా అవుతోంది. యుద్ధ ప్రభావం వల్ల గత రెండు నెలలుగా తారు ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. నిల్వలన్నీ అయిపోయాయి. దాంతో మార్కెట్‌లో తారు లభించడం లేదు. అటు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతోంది. వాటిని త్వరగా పూర్తిచేయాలని లక్ష్యాలు నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తారు రేటు భారీగా పెరిగింది. యుద్ధానికి ముందు టన్ను తారు రూ.40 వేల నుంచి రూ.45 వేల మధ్య లభించగా, ఇప్పుడు అదే తారు రూ.90 వేల నుంచి రూ.95 వేలకు విక్రయిస్తున్నారు. అది కూడా డిమాండ్‌కు తగినంత సరఫరా లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) విశాఖలో తారు మార్కెటింగ్, సరఫరాలో ముందు ఉంది. ఇప్పుడు కొరత ఏర్పడిన నేపథ్యంలో చెన్నైలోని ఐఓసీఎల్ రిఫైనరీ నుంచి తారు తెప్పించి స్థానికంగా 25 కిలోల బ్యాగుల ద్వారా సరఫరా చేస్తోంది.
భోగాపురం కోసం 700 టన్నుల కొనుగోలు
విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంఽధానం చేస్తూ, ఏడు మాస్టర్‌ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టింది. జూలైలో విమానాశ్రయం ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగానే ఆ రోడ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే నెలలో మూడు రోడ్లు, జూన్‌లో మిగిలిన నాలుగు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించింది. అయితే ఈ రహదారులకు తారు కొరత ఏర్పడింది. అత్యవసరం కావడంతో వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్‌లు చర్చించుకొని చెన్నైలోని ఐఓసీఎల్ నుంచి 700 టన్నుల తారును కొనుగోలు చేశారు. టన్ను రూ.90 వేలు పైనే పడిందని అధికార వర్గాల సమాచారం. బోయపాలెం మాస్టర్‌పాన్ రహదారిని 3.1 కిలోమీటర్ల పొడవుతో రెండు లేయర్లతో నిర్మాణానికి 418 టన్నుల తారును ఉపయోగిస్తున్నట్టు ఎస్‌ఈ మధుసూదనరావు తెలిపారు. ఈ పనులకు కాంట్రాక్టర్‌కు ఎస్కలేషన్ (అధిక మొత్తం) ఇవ్వక తప్పలేదని పేర్కొన్నారు. తారుకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉపయోగించే అవకాశం ఉందా?...అని విశాఖలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను సంప్రతించగా, అలాంటిదేమీ లేదని, తారునే వాడాలని సూచించడంతో ఆ అధిక ధరలతోనే పనులు పూర్తిచేస్తున్నామని ఎస్‌ఈ తెలిపారు. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గి, ముడి చమురు సరఫరా యథాప్రకారం జరిగినప్పుడు ఈ రేట్లు తగ్గుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, తారు కోసం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విశాఖ హెచ్‌పీసీఎల్‌కు వచ్చిన 150కి పైగా ట్యాంకర్లు వారంరోజులుగా రోడ్ల పక్కనే వేచి ఉన్నాయి.