అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:51 AM
భారత్‌లోని అగ్రశ్రేణి ప్రైవేటు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన బిట్స్ పిలాని (బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ ప్లస్ క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది.
దేశంలో ఏర్పాటుకానున్న తొలి ఏఐ క్యాంపస్ ఇదే
నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేశ్
గుంటూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): భారత్‌లోని అగ్రశ్రేణి ప్రైవేటు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన బిట్స్ పిలాని (బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ ప్లస్ క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది. దీని నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను మంత్రి లోకేశ్ శుక్రవారం పరిశీలించారు. బిట్స్ పిలాని ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్ చెన్నవీర్, బీఎస్ సహాని శుక్రవారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిసి అమరావతి క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంప్‌సలో ఉంటాయని తెలిపారు. 7 వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మాణాలను రెండు దశల్లో చేపడుతున్నామని చెప్పారు. ఈ క్యాంప్‌సపై వచ్చే ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను పాటిస్తున్నామని చెప్పారు. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంప్‌సగా ఉండబోతుందని తెలిపారు. బిట్స్ నిర్మాణ ప్లాన్లపై మంత్రి లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంప్‌సను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు.