బియ్యం ఎగుమతులు బంద్
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:32 AM
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేడి రాష్ట్ర రైతాంగాన్ని కూడా తాకుతోంది.
చెన్నై పోర్టులోనే నిలిచిన కంటైనర్లు
నెల్లూరు మిల్లుల్లో పేరుకుపోయిన సరుకు
యుద్ధంతో ‘గల్ఫ్’ పోర్టుల్లో ఆగిన కార్యకలాపాలు
బియ్యం మెజారిటీ ఎగుమతులు ఆ దేశాలకే..
కొనుగోలు చేసేందుకు జంకుతున్న వ్యాపారులు
రోజురోజుకూ పతనమవుతున్న ధాన్యం ధరలు
నెల్లూరు, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేడి రాష్ట్ర రైతాంగాన్ని కూడా తాకుతోంది. వారం నుంచి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో చెన్నై పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. ఇప్పటికే బయల్దేరిన బియ్యం కంటైనర్లు కూడా వెనక్కు వచ్చేశాయి. ఎగుమతి కోసం చెన్నైకు వెళ్లిన బియ్యాన్ని కూడా వెనక్కు తీసుకొచ్చి గోడౌన్లలో దించుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని నెల్లూరు, తమిళనాడుకు చెందిన మిల్లర్లు కొనుగోలు చేస్తుంటారు. వాటిని మిల్లింగ్ చేసి చెన్నై పోర్టు ద్వారా ఎగుమతి చేస్తుంటారు. గతంలో ఆఫ్రికన్ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు జరుగుతుండగా, ఇటీవల ఆ దేశాలు ఇచ్చే ధర నచ్చక వ్యాపారులు ఎగుమతులు తగ్గించారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలతో పాటు తుర్కియేకు ఎక్కువగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ ఎగుమతులన్నీ చెన్నై పోర్టు నుంచి దుబాయ్ పోర్టు మీదుగా వెళ్తాయి. కానీ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి పోర్టులను మూసివేయడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో పాటు ఇప్పటికే బయల్దేరిన బియ్యం కంటైనర్లు కూడా వెనక్కు వచ్చేసినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.
తిరిగి ఎప్పుడు కంటైనర్లు కదులుతాయన్నది తెలియడం లేదు. స్పష్టత కోసం మరో వారం ఎదురు చూడాల్సిందేనని పోర్టు వర్గాలు చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఆశాజనకంగా ఉన్న ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతుండడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం క్రితం వరకూ పుట్టి ధాన్యం (850 కేజీలు) ధర రూ.22,500 ఉండగా, ఇప్పుడు రూ.21,000కు పడిపోయిం ది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు మరింత పతనమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
దిగుబడిలో మెజారిటీ భాగం..
రాష్ట్రమంతా ఖరీఫ్ సీజన్ పూర్తి కాగా.. నెల్లూరులో వరి కోతలు ఇప్పుడు మొదలయ్యాయి. ఉత్పత్తయ్యే ధాన్యాన్ని అంతా స్థానికంగా విక్రయించడం అసాధ్యం. దిగుబడిలో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాలకు ఎగుమతి జరగాల్సి ఉంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు పోగా.. మిగతా ధాన్యాన్ని నెల్లూరు, తమిళనాడు వ్యాపారులు తీసుకొని వెళ్తుంటారు. ప్రస్తుతం బియ్యం ఎగుమతులు నిలిచిపోవడం, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మిల్లుల్లో ఉన్న సరుకును క్లియర్ చేయకుండా మళ్లీ కొత్తగా పెట్టుబడి పెట్టి సరుకు తీసుకునేందుకు జంకుతున్నారు.
ఈ సీజన్‌లో పెరిగిన పెట్టుబడి
ఈ సీజన్‌లో పంట పెట్టుబడి పెరిగింది. గతేడాది నవంబరులో నార్లు పోశాక వరుసగా మొంథా, దిత్వా తుఫాన్లతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. నార్లు, నాట్లు దెబ్బతినడంతో మళ్లీ వేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర పుట్టికి రూ.20,300 ఉంది. ప్రస్తుతానికికైతే ఎంఎ్‌సపీ కంటే బయట మార్కెట్లో ధర ఎక్కువగానే ఉంది. మరికొన్ని రోజులు బియ్యం ఎగుమతులు నిలిచిపోతే ఈ ధర తగ్గిపోయే ప్రమాదముంది. ఈ పరిస్థితుల దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించాల్సి ఉంది.