Share News

ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:47 AM

అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని మూడు గ్రామాల్లో కోళ్ల మృతికి బర్డ్‌ ఫ్లూ కారణమని నిర్ధారణ అయ్యిందని జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ గుణశేఖర్‌ పిళ్లై ఆదివారం తెలిపారు.

ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే చనిపోయాయి

  • భోపాల్‌ పరీక్షల్లో నిర్ధారణ

అమరావతి, సదుం, వెదురుకుప్పం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని మూడు గ్రామాల్లో కోళ్ల మృతికి బర్డ్‌ ఫ్లూ కారణమని నిర్ధారణ అయ్యిందని జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ గుణశేఖర్‌ పిళ్లై ఆదివారం తెలిపారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు రోజుల వ్యవధిలో అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె, కంభంవారిపల్లె పరిధిలోని నాటు కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక్కడి నమూనాలను అధికారులు భోపాల్‌ ల్యాబ్‌కు పంపించగా.. అక్కడి పరీక్షల్లో అమ్మగారిపల్లె, పుట్టావారిపల్లె కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే మరణించినట్లు నిర్ధారణ అయినట్లు జేడీ చెప్పారు. కంభంవారిపల్లెలో చనిపోయిన కోళ్లకు సంబంధించి నివేదిక రావాల్సి ఉందన్నారు.

కార్వేటినగరం మండలంలోనూ..

ఆర్కేవీబీ పేట పంచాయతీ ఇందిరాకాలనీలోని గోపినాథ్‌ కోళ్లఫారంలో వందలాదిగా కోళ్లు చనిపోయాయి. ఆదివారం పశుసంవర్థక శాఖ జేడీ ఉమామహేశ్వరి ఆ గ్రామానికి చేరుకుని చనిపోయిన కోళ్లను పరిశీలించారు. బర్డ్‌ప్లూ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. నమూనాలను సేకరించి భోపాల్‌ పంపారు. అప్రమత్తంగా ఉండాలని పౌల్ట్రీ రైతులకు, ప్రజలకు సూచించారు.


వ్యాధి నియంత్రణలోనే ఉంది

బర్డ్‌ ఫ్లూ నియంత్రణలోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందొద్దని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు తెలిపారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో ప్రభావిత ప్రాంతాల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ నివారణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సమీప గ్రామాల్లోనూ కోళ్ల రైతుల్ని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. పక్షుల్లో అసాధారణ మరణాలు గమనిస్తే, సమీప పశువైద్యశాలకు సమాచారం ఇవ్వాలన్నారు. వ్యాధిప్రభావిత ప్రాంతాల్లో కఠిన నియంత్రణ, కదలికల పర్యవేక్షణ; పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బర్డ్‌ఫ్లూ కేవలం పక్షులకు సంబంధించిందని, ప్రజలు ఏ ఆందోళన లేకుండా ఉడికించిన కోడి గుడ్లు, చికెన్‌ వినియోగించవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 04:48 AM