Share News

రేపు రాష్ట్రానికి బిల్‌గేట్స్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:01 AM

మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ నేతృత్వంలో ఫౌండేషన్‌ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.

రేపు రాష్ట్రానికి బిల్‌గేట్స్‌

  • సచివాలయంలో సీఎం, మంత్రులతో భేటీ!

  • ఆర్టీజీఎస్‌ ఫలితాలను ఆయనకు వివరించనున్న చంద్రబాబు

  • ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించనున్న గేట్స్‌ బృందం

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ నేతృత్వంలో ఫౌండేషన్‌ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయానికి రానున్న ఈ బృందంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఐటీ మంత్రి లోకేశ్‌తో పాటు మంత్రులు, వివిధ శాఖల అధికారులు సమావేశమవుతారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రానికి వెళ్లి పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ విధానాలు, ఫలితాలను బిల్‌గేట్స్‌కు చంద్రబాబు వివరిస్తారు. స్వర్ణాంధ్ర విజన్‌-2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై కూడా సీఎం ప్రజంటేషన్‌ ఇస్తారు. మెడ్‌టెక్‌, డయాగ్నోస్టిక్స్‌ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టుల వివరాలను ఆయనకు తెలియజేస్తారు. అనంతరం బిల్‌గేట్స్‌ బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ కేంద్రానికి వెళ్లనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగువిధానాన్ని బృందం పరిశీలిస్తుంది.

Updated Date - Feb 15 , 2026 | 04:02 AM