బిల్‌గేట్స్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:04 AM
దక్షిణకొరియా నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన బిల్‌గేట్స్‌కు విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, అనిత, సత్య కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్...
గన్నవరం/విజయవాడ, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): దక్షిణకొరియా నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన బిల్‌గేట్స్‌కు విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, అనిత, సత్య కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఘనస్వాగతం పలికారు. దట్టమైన పొగమంచు వల్ల విజిబిలిటీ లేక ఆయన వచ్చిన విమానం కొద్దిసేపు గాలిలో చెక్కర్లు కొట్టింది. మంచు తగ్గిన తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. రాష్ట్ర పర్యటన అనంతరం బిల్‌గేట్స్ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ముంబైకి పయనమయ్యారు. లోకేశ్ వీడ్కోలు పలికారు. కాగా.. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గుర్రపు డెక్క నారతో తయారుచేసిన బుట్టను గేట్స్‌కు బహూకరించి, సంప్రదాయ కలంకారి శాలువాతో సత్కరించారు. ఆ బుట్ట తయారు చేసిన విధానం గేట్స్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గుర్రపు డెక్క విరివిగా లభిస్తోందని, మచిలీపట్నం మండలం చిన్నాపురంలో డ్వాక్రా మహిళలతో సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి ద్వారా ఈ హస్తకళా ఉత్పత్తులను తయారు చేయించి.. లేపాక్షి, టీటీడీ, ఇతర సంస్థలకు ఆర్డర్లు అందిస్తూ మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.