Share News

‘గేట్స్‌’ భాగస్వామ్యంతో.. రాష్ట్రానికి దశ-దిశ

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:02 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్రానికి కొత్త దశ-దిశ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

‘గేట్స్‌’ భాగస్వామ్యంతో.. రాష్ట్రానికి దశ-దిశ

  • ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా కృషి: సీఎం

  • ఆర్టీజీఎస్‌లో చంద్రబాబుతో బిల్‌ గేట్స్‌ భేటీ

  • పౌరసేవల్లో టెక్నాలజీ, విజన్‌పై వివరణ

అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్రానికి కొత్త దశ-దిశ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కార్యాలయంలో సీఎంను ప్రత్యేకంగా కలిశారు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌, ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు, లక్ష్యాలు, కార్యక్రమాలు, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం తదితర అంశాలను ఆయనకు చంద్రబాబు వివరించారు. ‘జీరో పావర్టీ, సంపూర్ణ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భధ్రత, రైతు-అగ్రిటెక్‌, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్‌, ఎనర్జీ-ఫ్యూయల్‌, ప్రొడక్ట్‌ పర్ఫెక్షన్‌, స్వచ్ఛాంద్ర, డీప్‌ టెక్‌ వంటి పది సూత్రాలతో స్వర్ణాంధ్ర సాఽధనకు కృషి చేస్తున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, స్పీడ్‌ ఆఫ్‌ డెలివరీ గవర్నెన్స్‌ రాష్ట్రప్రభుత్వ విధానం. దీనికి ఆధార్‌ ధ్రువీకరణ, వ్యక్తిగత కుటుంబ డేటా లేక్‌, కుటుంబ సమాచారం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమగ్ర డేటా, అవేర్‌ ద్వారా రియల్‌ టైమ్‌ డేటా సేకరణ, వాట్సాప్‌ గవర్నెన్స్‌, డిజివెరిఫై వంటి అప్లికేషన్ల వినియోగం ద్వారా భవిష్యత్‌ కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. టెక్నాలజీ ఆధారిత థీమాటిక్‌ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్‌ వ్యాలీ డిజైన్‌ ఫౌండ్రీగా అమరావతిని, డేటా ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా కాకినాడ, డ్రోన్‌ సిటీగా ఓర్వకల్లు, ఎలకా్ట్రనిక్స్‌-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్‌ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం పది రంగాల్లో, 30 ప్రభుత్వ విభాగాల్లో కృత్రిమ మేధ(ఏఐ)ను వినియోగిస్తున్నాం. 98 ఏఐ యూజ్‌ కేసులు, 43 హ్యాకఽథాన్లు ఉన్నాయి’ అని చెప్పారు.


2.4 ట్రిలియన్‌ డాలర్ల జీఎస్టీ..

2047 నాటికి 180 బిలియన్‌ డాలర్ల నుంచి 2.4 ట్రిలియన్‌ డాలర్ల జీఎస్టీ సాధించాలని నిర్దేశించుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఎగుమతులను 20.7 బిలియన్‌ డాలర్ల నుంచి 4,450 బిలియన్‌ డాలర్లకు పెంచడం, నిరుద్యోగితను రెండు శాతానికి తగ్గించాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. ‘మహిళా కార్మికుల సంఖ్యను 45.8 శాతం నుంచి 80 శాతానికి పెంచుతాం. ప్రస్తుతం 72 శాతంగా ఉన్న అక్షరాస్యతను 100 శాతం సాధిస్తాం. ఈ ఏడాది జూలైనాటికి రాష్ట్రమంతటికీ సంజీవని కార్యక్రమాన్ని విస్తరిస్తాం’ అని వివరించారు.

గేట్స్‌తో మంత్రుల మాటామంతీ..

సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ గేట్స్‌తో సంభాషించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కార్యాలయం ఏర్పాటు ఆలోచనకు కారణమేమిటని పయ్యావుల ప్రశ్నించారు. చంద్రబాబు ఐటీని ప్రమోట్‌ చేయడం వల్ల టెక్‌ నిపుణులు చాలా మంది హైదరాబాద్‌ నుంచే వచ్చేవారని.. అదే సమయంలో ఆయన తనను కలసి మైక్రోసాఫ్ట్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించాలని ప్రతిపాదించారని గేట్స్‌ వెల్లడించారు. దీనిపై తమ సిబ్బంది అభిప్రాయం అడిగితే.. హైదరాబాద్‌లో కార్యాలయం పెడితే తాము అక్కడకు వెళ్లేందుకు సిద్ధమేనని వారు చెప్పారని తెలిపారు. ఏఐ టెక్నాలజీతో ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలు అందించవచ్చని, నాణ్యమైన నిపుణుల వైద్య సేవలు అందించవచ్చని గేట్స్‌ సత్యకుమార్‌కు చెప్పారు.

97లో తొలిసారి గేట్స్‌ను కలిశా..

గేట్స్‌తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను 1997లో మొదటిసారి తాను కలిశానని, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించానని చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ రాకతో ఇప్పుడు హైదరాబాద్‌ ఐటీ రంగంలో మేటిగా నిలిచిందన్నారు. ఏపీలో సహజ వనరులకు లోటు లేదన్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నంబరు వన్‌గా చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Feb 17 , 2026 | 04:03 AM