Share News

హలో ఫ్రెండ్‌.. హౌ ఆర్‌ యూ?

ABN , Publish Date - Feb 17 , 2026 | 03:57 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అని గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. చంద్రబాబు సమకాలీనుల్లో సింగపూర్‌ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైన, విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు.

హలో ఫ్రెండ్‌.. హౌ ఆర్‌ యూ?

  • బాబుకు బిల్‌ గేట్స్‌ ఆత్మీయ పలకరింపు

  • చంద్రబాబు విజనరీ.. ఆయన ఆలోచనలు విభిన్నం, వినూత్నం

  • తొలి సమావేశంలోనే ఈ విషయం గుర్తించా

  • బాబు సమకాలీనుల్లో సింగపూర్‌ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైన, విజన్‌ ఉన్న నేత.. ముఖ్యమంత్రిపై గేట్స్‌ ప్రశంసల వర్షం

ప్రపంచ దేశాల నాయకులను నేను ఎంతో మందిని కలిశాను. చాలా మంది నాయకుల కంటే చంద్రబాబు ఆలోచనలు విభిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. ఆయనతో మొదటి సమావేశంలోనే నేను ఈ విషయాన్ని గుర్తించాను. ఇతర నాయకుల కంటే ఆయన ఆలోచనలు చాలా ముందుంటాయి. చంద్రబాబు సమకాలీనుల్లో సింగపూర్‌ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలున్న నేత.

- బిల్‌ గేట్స్‌

అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అని గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ ప్రశంసించారు. చంద్రబాబు సమకాలీనుల్లో సింగపూర్‌ ప్రధాని ఒక్కరే ఆయనలా భిన్నమైన, విజన్‌ ఉన్న నాయకుడని అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం అమరావతి వచ్చిన గేట్స్‌ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ, భవిష్యత్‌ ప్రణాళికలను చర్చించుకుంటూ తన పర్యటన సాగించారు. అమరావతి వెలగపూడి సచివాలయం మొదటి బ్లాకు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురేగి గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే బిల్‌ గేట్స్‌.. ‘హలో ఫ్రెండ్‌.. హౌ ఆర్‌ యూ?’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులను బిల్‌ గేట్స్‌కు చంద్రబాబు పరిచయం చేశారు. గేట్స్‌పై ఉన్న గౌరవంతో చంద్రబాబు అంతకుముందు లోకేశ్‌ సహా నలుగురు మంత్రులను గన్నవరం విమానాశ్రయానికి పంపి స్వాగత ఏర్పాట్లు చేశారు.


బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ సందర్భంగా తన చాంబర్‌లోకి వచ్చిన బిల్‌ గేట్స్‌కు ముఖ్యమంత్రి తిరుమల వెంకటేశ్వరస్వామి నిలువెత్తు చిత్రపటాన్ని చూపించారు. శ్రీవారి ప్రాశస్త్యాన్ని, తిరుమల క్షేత్రం గొప్పతనాన్ని గేట్స్‌కు వివరించారు. గేట్స్‌ ఫౌండేషన్‌ బృందంతో బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ అనంతరం వారిని సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ విభాగం పనితీరును, అమరావతి నిర్మాణం గురించి వివరించారు. గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు పురోగతిని తెలియజేశారు. అనంతరం మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి గేట్స్‌ను తీసుకువచ్చారు. ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, లక్ష్యాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌కు రావడానికి దారితీసిన పరిస్థితులపై కొద్దిసేపు చర్చ జరిగింది. గేట్స్‌ కూడా నాటి ఢిల్లీ సమావేశం.. సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు, అమెరికా వెలుపల తొలి డెవల్‌పమెంట్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం గురించి సమావేశంలో ఉన్న మంత్రులు, సెక్రటరీలకు వివరించారు. తొలి మీటింగ్‌లోనే చంద్రబాబు విజనరీ ఆలోచనలను తాను గుర్తించానని బిల్‌ గేట్స్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


మంత్రుల ప్రశ్నలకు జవాబులు

మంత్రులు పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ యాదవ్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌బాబు బిల్‌గేట్స్‌ను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి, ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బిల్‌గేట్స్‌ బృందం సాగులో టెక్నాలజీ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర పర్యటన ముగించుకుని బయలుదేరి వెళ్లారు.

చంద్రబాబు గుడ్‌ ఓల్డ్‌ ఫ్రెండ్‌

డిజిటల్‌ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు ఉన్నాయని బిల్‌ గేట్స్‌ అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్‌ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజారిటీగా ఉన్నాయని చెప్పారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో విద్యాబోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందని అన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి కృత్రిమమేధ-సాంకేతికత ఉపయోగపడుతుందని పే ర్కొన్నారు. వ్యవసాయానికి ఏఐ అనుసంధానం చేయడాన్ని గేట్స్‌ అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐను అనుసంధానం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తనకు గుడ్‌ ఓల్డ్‌ ఫ్రెండ్‌ అని గేట్స్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

మహిళా రైతుల ఆత్మీయ స్వాగతం

తొలుత వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్‌కు మహిళా రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళా రైతులు స్వయంగా వండి తీసుకువచ్చిన స్థానిక వంటలను బిల్‌ గేట్స్‌ రుచి చూశారు. ఈ సందర్భంగా సేంద్రీయ సాగు పద్ధతులతో పండించిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 04:00 AM