ఏఐ అగ్రిసేవలు భేష్
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:51 AM
ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఏఐ-అగ్రిటెక్ సేవలు అత్యద్భుతమని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు.
అద్భుతంగా చేస్తున్నారంటూ గేట్స్ ప్రశంస
ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రం సందర్శన
సీఎంతో కలసి స్థానిక రైతులతో ముఖాముఖి
మహిళా రైతులు వండిన వంటలు రుచి
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఏఐ-అగ్రిటెక్ సేవలు అత్యద్భుతమని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాంకేతికతను, ఏఐ ఆధారిత రైతు సేవలను సోమవారం సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని గేట్స్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా రైతులు వినియోగిస్తున్న సాంకేతికత గురించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గేట్స్‌కు వివరించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలిపారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో అనలిటిక్స్, మానిటరింగ్ డ్యాష్ బోర్డులు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మణి, అన్నపూర్ణ ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏపీ-ఏఐఎంఎస్) యాప్ గురించి గేట్స్‌కు వివరించారు. ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి? సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి విషయాలు సులభంగా తెలుసుకుంటున్నామని చెప్పారు.
ఏఐ ద్వారా పంట తెగుళ్ల గుర్తింపు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే డ్రోన్ సేవలు పొంది పురుగు మందులను వినియోగిస్తున్న తీరును వివరించారు. బిల్ గేట్స్ సమక్షంలో రైతులు ఏఐ టూల్ ఉపయోగించి.. వ్యాధి సోకిన మొక్క ఫొటో తీసి అప్లోడ్ చేశారు. ఆ వ్యాధిని ఏఐ గుర్తించి నివారణ సూచనలు అందించింది. అనంతరం డ్రోన్ సేవను బుక్ చేయగా, మొక్కకు వ్యాధి వ్యాపించిన చోట డ్రోన్ పురుగు మందును స్ర్పే చేసింది. ఈ మొత్తం విధానాన్ని స్వయంగా చూసిన బిల్ గేట్స్.. రైతులకు ఏఐ-అగ్రిటెక్ సేవలు అత్యద్భుతంగా అందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రశంసించారు. అనంతరం స్థానిక రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు.