నైస్.. గుడ్.. గ్రేట్
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:48 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలు.. ‘నైస్, గుడ్, గ్రేట్’ అంటూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసలు
చంద్రబాబుతో కలసి ఆర్టీజీఎస్ సందర్శన అమరావతి, సంజీవని, డేటా లేక్
తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం
డిస్‌ప్లే వాల్ ద్వారా అధికారుల ప్రజెంటేషన్
ఆసక్తిగా పరిశీలించిన గేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో టెక్ పాలన ‘గ్రేట్’
వాట్సా్‌పతో పౌరసేవలు అభినందనీయం
అమరావతి నిర్మాణం ‘గ్రేట్ వర్క్’
సంజీవని ప్రాజెక్టు ‘నైస్’ అంటూ కితాబు
టెక్నాలజీ ద్వారా అందిస్తున్న పాలన చాలా బాగుంది. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు సులభతరం చేయడం అభినందనీయం. టెక్ పాలన ‘గ్రేట్’. ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్టు ‘నైస్’. ఏఐ ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్న విధానం ‘గ్రేట్’. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం ‘గ్రేట్ వర్క్’.
- బిల్ గేట్స్
అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలు.. ‘నైస్, గుడ్, గ్రేట్’ అంటూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణ పనులు, సంజీవని ప్రాజెక్టు, ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అద్భుతమని అన్నారు. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్.. అమరావతిలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ డిస్‌ప్లేలపై ప్రదర్శించిన ప్రజెంటేషన్లను ఆసక్తిగా తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా టెక్నాలజీ సాయంతో పౌర సేవలను వేగవంతంగా అందిస్తున్న తీరును గేట్స్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
డేటా లేక్‌తో ప్రభుత్వ విభాగాలన్నింటిని అనుసంధానం చేశామని చెప్పారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డులు, అమరావతి రాజధాని అంశాలపై అధికారులు డిస్‌ప్లే వాల్ ద్వారా గేట్స్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి ప్రజలకు వేగంగా అందిస్తున్న విధానాన్ని వివరించారు. ప్రజలు, రైతులకు 42 రకాల సమాచారాన్ని ముందస్తుగా చేరవేయడం వల్ల ఆపత్కాలంలో తక్షణమే స్పందించేందుకు వీలు కలుగుతోందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 921 రకాల ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల తమ పనుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా పొందవచ్చని వివరించారు. ప్రజల చేతుల్లోని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నుంచే ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్లు అందుకునే సులభతర విధానాన్ని పాలనలో తీసుకువచ్చామని గేట్స్‌కు అధికారులు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, పాలసీలు వంటివాటి గురించి ప్రజాభిప్రాయ సేకరణపై గేట్స్ ఆరా తీశారు. రాష్ట్రంలో జీఎస్టీ పెరుగుదలను కూడా కీ-పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా తెలుసుకోవడం ద్వారా పన్నుల సేకరణ వేగవంతంగా, సులువుగా జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. జీఎస్టీ విధానం వల్ల పన్నుల రాబడి బాగా పెరిగిందని చెప్పారు. బ్లాక్ చెయిన్ విధానంలో రెవెన్యూ, ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామని వివరించారు. భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ డాక్యుమెంట్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏపీ ఏఐ సెర్చ్ బార్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. డేటా లేక్‌తో ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తున్న తీరును సీఎం వివరించారు.
గేట్స్ ప్రశంసల వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ ద్వారా అందిస్తున్న పాలన చాలా బాగుందని గేట్స్ అభినందించారు. అమరావతి నిర్మాణం గురించి గేట్స్ ఆరా తీశారు. రాజధాని నిర్మాణం తీరును ముఖ్యమంత్రి వివరించారు. 30 శాతం భూమి పచ్చదనం, నీటి వనరులు కోసం కేటాయించడం బాగుందని గేట్స్ ప్రశంసించారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, బ్లూ గ్రీన్ కాన్సెప్ట్, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం ‘గ్రేట్ వర్క్’ అంటూ గేట్స్ ప్రశంసించారు.
సంజీవని చాలా బాగుంది
సంజీవని ప్రాజెక్టు ‘వెరీ గ్రేట్’ అని బిల్ గేట్స్ ప్రశంసించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లా కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని పథకంపై ఆయన ఆరా తీశారు. అధికారులు ప్రజెంటేషన్ ద్వారా గేట్స్‌కు వివరించారు. బీపీ, మధుమేహం వంటి వాటికి సంజీవని ద్వారా చేస్తున్న డిజిటల్ పరీక్షలు, వైద్య సేవల గురించి ఆయన తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డుల గురించి అధికారులు వివరించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు ద్వారా వైద్య పరీక్షలు, సేవలు చక్కగా అందుతున్నాయని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా ‘దట్స్ నైస్’ అంటూ గేట్స్ ప్రశంసించారు. ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని సీఎం చెప్పారు. ఏఐ ఉపయోగించి వైద్య సేవలను అందిస్తున్న తీరుపై గేట్స్ ఆసక్తి చూపారు. ఈ విధానం బాగుందన్నారు. బయో డిజైన్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి గేట్స్ తెలుసుకున్నారు.
గేట్స్, సింధు బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో బిల్‌గేట్స్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. గేట్స్ ఫౌండేషన్, పీవీ సింధు ఫౌండేషన్ కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా విజయవాడ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో సోమవారం ఒక యాడ్‌ను చిత్రీకరించారు. గేట్స్, సింధు క్రీడాకారుల దుస్తులు ధరించి షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు.
యువ అధికారుల ప్రజెంటేషన్
ఆర్టీజీఎ్‌సలో బిల్ గేట్స్‌కు యువ ఐఏఎస్ అధికారులు సమగ్ర ప్రణాళికల అమలు తీరును క్షుణ్నంగా వివరించారు. ఈ సందర్భంగా వీడియోలు ప్రదర్శించారు. ఆర్టీజీఎస్ అధికారులు ధాత్రి రెడ్డి, మల్లికా గార్గ్, ప్రఖార్‌జైన్, సురేశ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్‌సెప్షన్, ఏఐ పెర్ఫార్మెన్స్, ఏఐ సెర్చ్‌బార్, సంజీవని, అమరావతి గురించి గేట్స్‌కు వివరించారు.