పోలీసుస్టేషనలోనే బైక్ మాయం
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:41 PM
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వనటౌన పోలీసులు పట్టుకున్న వాహనం పోలీసుస్టేషనలో ఉంచగా అక్కడి నుంచి మాయం అయింది.
ఏడు నెలలైనా అందని వాహనం
ఎస్పీ ఫిర్యాదు చేసిన బాధితుడు
ఆదోని, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వనటౌన పోలీసులు పట్టుకున్న వాహనం పోలీసుస్టేషనలో ఉంచగా అక్కడి నుంచి మాయం అయింది. ఇప్పుడు ఈ ఘటన ఆదోనిలో సంచలనంగా మారింది. ఏడు నెలలు గడిచినా బాధితుడికి వాహనం అందలేదు. దీంతో బాధితుడు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. వివరాలు.. ఆదోని పట్టణంలో నివసించే సోమశంకర్ అనే వ్యక్తి కుటుంబ పోషణకై హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. అతడు గతేడాది సెప్టెంబర్ నెలలో ఆదోనికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత ఆదోనికి చేరుకోవడంతో స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. తన అవెంజర్ బైకుపై వెళ్తుండగా వన్‌టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించి డ్రంకెన డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. రూ.10వేలు జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అప్పట్లో డబ్బులు లేకపోవడంతో అతడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. బైకును వన్‌టౌన్ పోలీసుల ఆధీనంలో ఉంచి వెళ్లాడు. వారం రోజుల తర్వాత బైక్ కోసం రాగా అక్కడ వాహనం కనిపించలేదు. సిబ్బందిని అడిగితే వారం రోజుల్లో వెతికి పెడతాం అంటూ కాలయాపన చేశారు. వారం కాస్త నెలైంది. నెలలు కాస్త ఏడు నెలలైంది. బాధితుడు నిలదీసినా పోలీసులు సమాధానం చెప్పలేకపోవడంతో పోలీసుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. చివరికి విసిగిపోయిన బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రక్షకభట నిలయంలోనే వస్తువులు మాయమైతే సామాన్యుడికి భద్రత ఎక్కడ ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.