Share News

తీర్థయాత్రలకు వెళుతుండగా విషాదం!

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:50 AM

ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి బయలుదేరిన టూరిస్ట్‌ బస్సు ఆదివారం అర్ధరాత్రి బిహార్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

తీర్థయాత్రలకు వెళుతుండగా విషాదం!

  • బిహార్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొన్న టూరిస్టు బస్సు.. ముగ్గురి మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

  • బాధితులంతా నెల్లూరు జిల్లా సంగం వాసులు

  • సహాయ చర్యలకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం

  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు,క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు

సంగం/అమరావతి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి బయలుదేరిన టూరిస్ట్‌ బస్సు ఆదివారం అర్ధరాత్రి బిహార్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో బస్సు ఎడమ వైపు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 1వ తేదీన సంగం గ్రామానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 15 రోజులపాటు పూరి, కోణార్క్‌, భువనేశ్వర్‌, వైద్యనాథ్‌, గయ, బుద్ధ గయ, కాశీ, ప్రయాగ, అలహాబాద్‌, అయోధ్య, శ్రీకూర్మం, అరసవెల్లి, సింహాచలం, అన్నవరం క్షేత్రాల సందర్శన నిమిత్తం 40 మంది యాత్రికులు, ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు వంట మాస్టర్లు మొత్తం 45 మంది బయలుదేరారు. ఈ క్రమంలో ప్రయాగ దర్శనం తరువాత ఆదివారం రాత్రి 10.20 గంటలకు కాశీకి బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఔరంగబాద్‌కు సమీపంలో బస్సు డ్రైవర్‌ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొని కొంత దూరం దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు ధ్వంసమైంది. ముందు సీటులో కూర్చొనున్న ఆర్గనైజర్‌ పసుపులేటి వెంకటేశ్వర్లు (63), చౌడం హజరతయ్య (60), తూమా పద్మావతి (43) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బిహార్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప వైద్యశాలకు తరలించారు.


ఈ సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించి కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతోపాటు సీఎం కార్యాలయ అధికారులను అప్రమత్తం చేశారు. కాగా.. బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున సాయం అందించనున్నట్టు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించడంతోపాటు అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, మృతదేహాలతోపాటు యాత్రికులను ప్రత్యేక విమానంలో మంగళవారం చెన్నైకు తీసుకురానున్నట్లు మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు.

Updated Date - Jun 09 , 2026 | 05:52 AM