నిషేధిత సిగరెట్ల రాకెట్ గుట్టురట్టు
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:01 AM
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత, అన్ బ్రాండెడ్ సిగరెట్ల రాకెట్ గుట్టును విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రట్టు చేశారు.
కాకినాడ జిల్లా తూరంగిలో రూ.1.75 కోట్ల విలువైన అన్ బ్రాండెడ్ నిల్వలు స్వాధీనం
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు
కాకినాడ రూరల్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత, అన్ బ్రాండెడ్ సిగరెట్ల రాకెట్ గుట్టును విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రట్టు చేశారు. సోమవారం దాడులు నిర్వహించి సుమారు రూ.1.75 కోట్లు విలువ చేసే అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. తూరంగి బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా సిగరెట్ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్రమ సిగరెట్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ తాతారావు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడలోని సూర్యనారాయణపురానికి చెందిన పచ్చిగోళ్ల అప్పారావు రెండు నెలల కిందట తూరంగి శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఇతడు ఒడిసా, బిహార్‌లోని పాట్నా నుంచి నిషేధిత, అన్ బ్రాండెడ్ కల్తీ సిగరెట్లను కొనుగోలు చేసి, లారీల్లో తూరంగి తీసుకొచ్చి అక్రమంగా నిల్వ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాల్లోని పలు పాన్‌షాపులకు బిల్లులు లేకుండా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం చేసిన దాడుల్లో రూ.1.75 కోట్ల విలువ చేసే 311 బాక్సుల్లో ఉన్న 3,73,200 అన్ బ్రాండెడ్ సిగరెట్ పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అప్పారావును అదుపులోకి తీసుకొని, తదుపరి విచారణ కోసం ఇంద్రపాలెం పోలీసులకు అప్పగించారు. ఒక్కో పెట్టెపై రేటు రూ.40 ఉందని, కొన్నింటిపై రూ.64, రూ.100 ముద్రించి ఉందని తాతారావు తెలిపారు. ఈ సరుకును నిందితుడికి సరఫరా చేస్తున్న వారి పేర్లు, ఈ రాకెట్‌లో ఇంకెవరైనా ఉన్నారా? అనే వివరాలు పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. అప్పారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు.