Trainee Police Constables: ట్రైనీ పోలీసులకు భారీ ఊరట
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:44 AM
రాష్ట్రంలోని స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
స్టైపెండ్ రూ.4,500 నుంచి రూ.12వేలకు పెంపు
రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. తొమ్మిది నెలల శిక్షణ కాలంలో చెల్లించే స్టైపెండ్‌ను నెలకు రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచుతూ హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విడుదల చేసినా న్యాయ పరమైన చిక్కులు పరిష్కరించకుండా వదిలేసిన పరీక్ష ఫలితాలను కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించి విడుదల చేసింది. దీంతో ఎంపికైన 5751 మంది కొత్త కానిస్టేబుళ్లు డిసెంబరు 20 నుంచి రాష్ట్రంలోని డీటీసీలు, పీటీసీలు, బీటీసీల్లో శిక్షణకు చేరారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్టైపెండ్ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడికక్కడే రూ.12వేలకు పెంచుతూ సీఎం ప్రకటన చేశారు. ఆ మేరకు బుధవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 21 కేంద్రాల్లో ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ సజావుగా జరుగుతోందని, 2, 3 రోజుల్లో అన్ని కేంద్రాల్లోనూ స్ర్కీన్లు ఏర్పాటు చేసి నిపుణులతో ఆన్‌లైన్ ద్వారా క్లాసులు చెప్పిస్తామని పోలీస్ ట్రైనింగ్ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. ప్రతి అభ్యర్థినీ సైకో మెట్రిక్ అసెస్మెంట్ చేసి, అందుకు తగ్గట్టు శిక్షణ ఇచ్చి, పోలీసు శాఖకు నాణ్యమైన సేవలు అందించేలా తీర్చిదిద్దబోతున్నట్లు పేర్కొన్నారు.