Share News

హమ్మయ్య... పెద్దపులి చిక్కింది

ABN , Publish Date - Feb 07 , 2026 | 03:56 AM

తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా సంచరించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది.

హమ్మయ్య... పెద్దపులి చిక్కింది

  • గన్‌ ద్వారా మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బంధించిన అధికారులు

  • విశాఖపట్నంలోని జూకు తరలింపు

రాయవరం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా సంచరించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురంలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన అటవీశాఖ అధికారులు పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పట్టుకున్నారు. శక్రవారం ఉదయం రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాత పెంకుటింట్లోకి పులి దూరింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.50గంటల సమయంలో పుణే నుంచి వచ్చిన రెస్క్యూ టీం, మత్తు మందు ఇచ్చే గన్‌ షూటర్లు పులిని షూట్‌ చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా ఇంటి గేటుపై నుంచి ఎదురుగా ఉన్న పంటబోదెలోకి దూకేసింది. తర్వాత గ్రామానికి చెందిన కొలగాని సత్తిబాబుకు చెందిన పశువుల పాకలో దూరింది. సాయంత్రం 6:30 గంటలకు పశువుల పాకనుంచి పెద్దపులి మళ్లీ బయటకు వచ్చింది. అప్పటికే ఇద్దరు గన్‌ షూటర్లు మాటువేసి ఉన్నారు. వారిలో ఒకరు షూట్‌ చేయగా మిస్సయింది. మరొకరు షూట్‌ చేసిన మత్తు ఇంజెక్షన్‌ తగలడంతో అక్కడినుంచి కొంచెం దూరం పరిగెత్తింది. పంచాయతీ కార్యాలయం సమీపంలోని పాత కోళ్లఫాం వద్ద ఉన్న ఖాళీస్థలం నుంచి 50 మీటర్ల దూరం వరకు వెళ్లి మత్తుతో పడిపోయింది. దీంతో వల వేసిన అధికారులు పెద్దపులిని బోనులో బంధించి విశాఖలోని జూకు తరలించారు.

Updated Date - Feb 07 , 2026 | 03:56 AM