భూమనపై భక్తా.. భయమా?
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:00 AM
గత జగన్ ప్రభుత్వంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి భూ ఆక్రమణల పర్వం అడ్డే లేకుండా సాగింది. ఆయన కన్ను పడిందంటే.. ఇక ఆ భూమి సంగతి అంతే. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని..
ఆక్రమిత భూముల స్వాధీనంలో ‘రెవెన్యూ’ తాత్సారం
నాడు అడ్డగోలుగా కరుణాకరరెడ్డి భూ ఆక్రమణలు
50 కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూమి స్వాహా
స్వాధీనం చేసుకోవాలని విజిలెన్స్ సిఫారసు
అవసరమైతే పోలీసుల సాయం తీసుకోవాలని సూచన
అలాగే 45 కోట్ల విలువైన ఇనాం భూమీ ఆక్రమణ
తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారుల వెనకడుగు
ఆయన అధీనంలోనే 3 ఎకరాల ప్రైవేటు భూమి కూడా
విజిలెన్స్ విచారణలో అక్రమాలు గుర్తింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత జగన్ ప్రభుత్వంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి భూ ఆక్రమణల పర్వం అడ్డే లేకుండా సాగింది. ఆయన కన్ను పడిందంటే.. ఇక ఆ భూమి సంగతి అంతే. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిరుపతి సమీపంలోని తిరుచానూరు పంచాయతీ పరిధిలో రూ.45 కోట్ల విలువైన 9 ఎకరాల ఇనాం భూమిని ఆక్రమించారు. అలాగే మంగళం పరిధిలోని ప్రభుత్వ భూమినీ స్వాహా చేశారు. సుమారు రూ.50 కోట్లకు పైగా విలువైన 7.30 ఎకరాల అనాధీనం భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిగింది. భూమన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. భూమన అధీనంలో ఉన్న 7.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందిగా దాదాపు 6 నెలల క్రితం రెవెన్యూ శాఖకు సిఫారసు చేశారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అటు తిరుచానూరు గ్రామ పరిధిలోని 9 ఎకరాల ఇనాం భూమి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. భూమనకు రెవెన్యూ అధికారులు భయపడుతున్నారా? లేక అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ అక్రమాలు
తిరుపతి అర్బన్ మండలం మంగళం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 6లో మంగళం చెరువు ఉంది. అలుగు సర్వే నంబరు 6, సర్వే నంబరు 47 మధ్యలో ఈ చెరువు ఉంది. ఇది చెరువు పోరంబోకు, ప్రభుత్వ భూమి. మంగళం గ్రామంలోని సర్వే నంబరు 47 కింద మొత్తం 12.91 ఎకరాలు ఉంది. ఈ సర్వే నంబరును 47-1, 47-2, 47-3, 47-4, 47-5 కింద ఐదు సబ్ డివిజన్లుగా విభజించారు. ఇందులో సర్వే నంబరు 47-1లో 5.10 ఎకరాలు మంద బయలుగా రికార్డుల్లో పొందుపర్చారు. 47-2 సర్వే నంబరులోని 2.20 ఎకరాలు కె.లోకనాథం పేరుతో పట్టా ఉంది. 47-3లోని 1.04 ఎకరాలు మంగమ్మ పేరుతో, 47-4లోని 0.44 ఎకరాలు ఎ.వరదరాజులు పేరుతో పట్టాలున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరోవైపు 47-5 సర్వే నంబర్ పరిధిలోని 3.07 ఎకరాలు అనాఽధీనం పుంజ భూమిగా రికార్డుల్లో నమోదైంది. ఈ ప్రాంతంలోనే 47 సర్వే నంబరు పరిధిలో ధర్మరాజుల ద్రౌపదమ్మ, మూలస్థానమ్మ, నాగాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం వాడుకలో ఉన్న 18 అడుగుల రోడ్డు సైతం ఇదే సర్వే నంబరు నుంచి పోతుంది. అప్పటి ఎమ్మెల్యే భూమన సర్వే నంబరు 47-1, 47-5లో 7.30 ఎకరాల భూమి ఆక్రమించారు. వాస్తవానికి ఆ రెండు సబ్‌డివిజన్ల పరిధిలోని భూమి మంద బయలు, అనాధీనం అంటే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో స్పష్టంగా నమోదైంది. ఆ భూములను స్థానిక రైతులు పశువుల మేత కోసం వాడుకుంటున్నారని తెలిసి కూడా ఆయన ఆక్రమణకు తెగబడ్డారు.
ప్రైవేటు భూమీ స్వాహా
ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూమిని సైతం భూమన ఆక్రమించారు. సర్వే నంబరు 47లోనే అసలు భూ యజమానిని బెదిరించి 3.07 ఎకరాల భూమిని కరుణాకరరెడ్డి ఆక్రమించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.