జగన్‌పై హిందూత్వ వ్యతిరేక ముద్రకు కూటమి కుట్ర: భూమన
ABN , Publish Date - Feb 07 , 2026 | 06:02 AM
మాజీ సీఎం జగన్‌ను హిందూత్వ వ్యతిరేకిగా ముద్ర వేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని, దీనిలో భాగమే..
రోజాతోపాటు అంబటి కుటుంబానికి పరామర్శ
గుంటూరు/విజయవాడ/ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ను హిందూత్వ వ్యతిరేకిగా ముద్ర వేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని, దీనిలో భాగమే.. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబును బూతులతో దూషించిన కేసులో అర్టెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి భూమన, మాజీ మంత్రి రోజా తదితరులు శుక్రవారం వచ్చారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూలో కల్తీ లేదని సిట్ పేర్కొందని భూమన తెలిపారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ కూటమి ప్రభుత్వం.. జగన్‌ను అభాసుపాల్జేయాలని పన్నాగం పన్నుతోందని విమర్శించారు. మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు లేదని సిట్ నివేదికలో పేర్కొన్నా.. సీఎం చంద్రబాబు పదే పదే కల్తీ అంటున్నారని, ఆయనకు దేవుడు కల్లోకొచ్చి చెప్పాడేమో చెప్పాలని వ్యాఖ్యానించారు. మాజీమంత్రి జోగి రమేశ్, ఆయన కుటుంబంపై కక్ష కట్టి దాడి చేశారని ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను రోజా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘తిడితే దాడులు చేస్తారా?. మరి మేం అధికారంలో ఉండగా మీరు తిట్టారుగా.. అప్పుడు మేమేం చేయాలి?. విపక్ష నాయకులపై దాడులు చేస్తే భవిష్యత్‌లో మిమ్మల్ని కాపాడేందుకు కూటమి నేతలు రారన్న విషయాన్ని దాడులకు పాల్పడే వారు గుర్తుంచుకోవాలి.’’ అని హెచ్చరించారు.