Share News

భూమాతకు జలహారతి

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:15 AM

నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే భూమాతకు మనమిచ్చే జలహారతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

భూమాతకు జలహారతి

  • నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరందించవచ్చు

  • మే 15 నాటికే నారుమళ్లకు నీళ్లందిస్తాం

  • వర్షం నీటిని సంరక్షించుకుని రబీకి వాడతాం

  • కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాం

  • ‘పుష్కరాలకు’ ముందే పోలవరం తొలిదశ

  • 2027 మార్చికి ఎడమ కాలువ పూర్తి చేస్తాం

  • అనకాపల్లికి గోదావరి జలాలు అందిస్తాం

  • సీమ ఎత్తిపోతలపై స్టేను జగన్‌ ఎందుకు ఎత్తివేయించలేదు?

  • చేతకానివాళ్లు ఇప్పుడు ఎంతో చేశామని మాట్లాడుతున్నారు!

  • నీరు-ప్రగతి-జలహారతి కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే భూమాతకు మనమిచ్చే జలహారతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాగునీటి ప్రదేశ్‌గా, కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలిదశను పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి అనకాపల్లికి నీరందిస్తామని వెల్లడించారు. పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధానం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు గోదారి జలాలు తరలిస్తామన్నారు. తుఫాను బారిన పడి రైతులు నష్టపోకుండా, ఈ ఏడాది నుంచి ఖరీఫ్‌ పంట ప్రణాళికలు మారుస్తున్నామని తెలిపారు. అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన నీరు-ప్రగతి-జల హారతి సాగునీటి వినియోగ సంఘాల భాగస్వామ్య కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది మే 15వ తేదీనాటికి వరి నారుమళ్లకు నీరందిస్తామని .. వర్షాకాలంలో కురిసిన వాన నీటిని సంరక్షించుకుని రబీ పంటకు వాడుకోవాలని రైతాంగానికి సూచించారు. ఈ ఏడాది మే ఒకటో తేదీ నుంచి నీటి సంవత్సరంగా లెక్కిస్తామన్నారు. వరి పంటను తగ్గించుకుని, పండ్లతోటల పెంపకానికి వెళ్లాలని రైతులకు సూచించారు. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. యూరియా వాడకాన్నీ తగ్గించాలని సూచించారు.

జగన్‌ హయాంలోనే సీమ ఎత్తిపోతలపై స్టే..

2020లో సీఎంగా జగన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) స్టే ఇచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ స్టేను ఎత్తివేయించే ప్రయత్నం జగన్‌ చేయలేదెందుకని నిలదీశారు. ఆ పథకాన్ని ఇప్పుడు ఆపేశామంటూ జగన్‌ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ చేతకాక చేయలేని పనులను చేసేసినట్లుగా మాట్లాడుతున్నారని, చేతకానివాళ్లే ఇలా మాట్లాడతారని విమర్శించారు. ఒక నిర్ధిష్ట లక్ష్యంతో రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు కాలువను విస్తరించి కుప్పం దాకా నీటిని తరలించామన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు రైతాంగానికి సానుకూల ప్రదేశ్‌గా మార్చేశామని తెలిపారు. నీటి భద్రత అందరికీ కావాలని, కానీ ఎవరూ ఆచరించరని చురకలంటించారు. తెలంగాణ కాళేశ్వరం కట్టుకుంటే ఏపీ అడ్డు చెప్పలేదన్నారు. గోదావరి జలాలు ప్రతియేటా రెండు వేల టీఎంసీలకుపైగా సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని.. ఇందులో 200 టీఎంసీలను పోలవరం-నల్లమల సాగర్‌కు మళ్లిస్తే రాష్ట్రంలో కరువేలేకుండా చేయవచ్చన్నారు. నీటి విలువ తెలిసిన వ్యక్తినని, భూగర్భ జలాలను పెంచుతూ భూమినే రిజర్వాయరుగా మలచాలన్నదే తాపత్రయమని తెలిపారు.


హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చేందుకు కృషి..

అనంతపురం జిల్లాలో చేపడుతున్న జల సంరక్షణ విధానాలను ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అనంతపురాన్ని పండ్లతోటల వనంగా మార్చిన ఘనత ఎన్డీయేదే అన్నారు. రాష్ట్రాన్ని హార్టీకల్చర్‌ హబ్‌గా మలచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ఎకరాకూ నీరిచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు యత్నించాలని.. పరిగెత్తే నీటిని నిలపాలని, భూమినే జలాశయంగా మార్చే ప్రణాళికఅమలు చేయాలని కోరారు.

పోలవరంపైనా జగన్‌ విధ్వంసం..

పోలవరం ప్రాజెక్టునూ జగన్‌ విధ్వంసానికి గురిచేశాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.440 కోట్లతో నిర్మించిన డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్లక్ష్యంతో ధ్వంసం చేశాడన్నారు. సమాంతర డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించేందుకు రూ.1000 కోట్లను అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతోపాటు సమయమూ వృధా అయిందని చెప్పారు. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా నీరివ్వడం వల్ల రూ.50 వేల కోట్ల జీఎ్‌సడీపీ వ్యవసాయోత్పత్తి ద్వారా వచ్చిందన్నారు. కరువును తరిమికొట్టేలా కార్యాచరణ చేపడుతున్నామని, 2014-19 కాలంలో జలవనరుల ప్రాజెక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చుచేశామని, వాటి ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని వెల్లడించారు.

సంఘాల పనులపై జీఎస్టీ రద్దు చేయుస్తాం..

జల వనరుల శాఖ చేపట్టే కాలువల అభివృద్ధి, నీటి సంరక్షణ, వారబందీ, నీటి యాజమాన్య సంరక్షణ విధానాలు, నీటి పన్నుల వసూలు తదితర పనులన్నీ సాగునీటి వినియోగదారుల సంఘాలతోనే చేయిస్తామని చంద్రబాబు వెల్లడించారు. సంఘాల ద్వారా చేసే పనులపై జీఎస్టీని రద్దు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, దుర్గేశ్‌, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి సంఘాల హర్షం..

సాగునీటి రంగంలో చేపట్టే పనుల్లో వినియోగదారుల సంఘాలను భాగస్వాములను చేస్తామని, జీఎస్టీని రద్దు చేయిస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనపై రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంటకగోపాల కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు.

సాగునీటి సంఘాల సమావేశంలో సీఎం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వేదిక మీదకు వచ్చిన వెంటనే ర్యాంపు మీదుగా నడిచి వెళ్తూ సంఘాల ప్రతినిధులు, సామాన్యులు ఇచ్చిన అర్టీలను మంత్రులతో కలిసి సీఎం స్వీకరించారు. ర్యాంపుపై అటూ ఇటూ నడుస్తూనే దాదాపు రెండున్నర గంటల సేపు ప్రసంగాన్ని కొనసాగించారు. మధ్యలో సాగునీటి సంఘాల ప్రతినిధులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఉల్లాసంగా మాట్లాడారు.

Updated Date - Feb 06 , 2026 | 03:15 AM