Share News

అదే అధికారి.. ఆగని దందా

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:10 AM

ఆయన... రాయలసీమకు చెందిన ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. గత జగన్‌ ప్రభుత్వంలో ప్రధాన పదవిలో పనిచేశారు. జగన్‌కు వీరభక్తుడు. సర్వీసులో ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకొని ఉత్తరాంధ్రలోని కీలక భూములపై కన్నేశారు.

అదే అధికారి.. ఆగని దందా

  • జగన్‌ వీరభక్త రిటైర్డ్‌ ఐఏఎస్‌ అరాచకాలు

  • భోగాపురంలో భూముల దోపిడీకి స్కెచ్‌

  • ఎయిర్‌పోర్టు పరిసర భూములపైనే కన్ను

  • కి.మీ. దూరంలో 32 ఎకరాలకు ఒప్పందాలు

  • వీటిలో డీ-పట్టా, మరికొన్ని పట్టా భూములు

  • వెనుకవైపు కంచేరు గ్రామంలో 20 ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసేందుకు ఒత్తిళ్లు

  • దారికి రాని పట్టా రైతులపై బలప్రయోగం

  • అమరావతికి పిలిపించి బెదిరింపులు

  • ఓ రైతుకు పదిసార్లు రెవెన్యూ నోటీసులు

  • చివరకు భూ యజమానిపైనే కబ్జా కేసు

  • రెవెన్యూ, పోలీసు వ్యవస్థలను వాడుతున్న వైనం

  • జగన్‌ హయాంలో 150 ఎకరాలు సొంతం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆయన... రాయలసీమకు చెందిన ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. గత జగన్‌ ప్రభుత్వంలో ప్రధాన పదవిలో పనిచేశారు. జగన్‌కు వీరభక్తుడు. సర్వీసులో ఉన్నప్పుడు తన అధికారాన్ని ఉపయోగించుకొని ఉత్తరాంధ్రలోని కీలక భూములపై కన్నేశారు. విశాఖ, భీమిలి, భోగాపురంలోని విలువైన డీ పట్టా భూములు దక్కించుకున్నారు. తన మేనల్లుడు, కొడుకును ముందుపెట్టి పచ్చని అసైన్డ్‌తో పాటు పట్టా భూములను చెరపట్టారు. కూటమి సర్కారు వచ్చాక కూడా ఆయన ఆగడాలు ఆగడం లేదు. భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చినప్పటి నుంచే మరింత దూకుడు పెంచారు. కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులను ఉపయోగించుకొని అడ్డగోలు దందాలకు తెరలేపారు. మాట వినని, భూములు ఇచ్చేందుకు ఒప్పుందాలు చేసుకోని డీ పట్టా, పట్టా భూముల రైతులపై తన ప్రతాపం చూపిస్తున్నారు. విశాఖ, అమరావతికి పిలిపించి బెదిరింపులకు దిగుతున్నారు. సొంత భూములున్న రైతులపైనే కబ్జాకేసులు పెట్టించి వేధిస్తున్నారు. దారికి రానివారిని నయానో, భయానో ఒప్పించేందుకు కూటమిలోని కొందరు ప్రజాప్రతినిధులను సైతం వాడుకుంటున్నారు. నాటి జగన్‌ ప్రభుత్వంలో చివరి ఆరు నెలల కాలంలో కంటే మరింతగా ఆయన భూదాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యాక రిటైర్డ్‌ అధికారి అరాచకాలు శ్రుతిమించిపోతున్నాయి.


ఎయిర్‌పోర్టు పక్కన భూములపైనే కన్ను

కూటమి ప్రభుత్వం వచ్చాక భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లోని భూములపై రిటైర్డ్‌ అధికారి కన్నేశారు. ఉత్తరాంధ్రకే చెందిన రెవెన్యూ లిటిగెంట్‌ త్రిలోకం అనే వ్యక్తిని ముందుపెట్టి విలువైన భూములను చేజిక్కించుకునే ప్రయత్నాలు జోరుగా చేయిస్తున్నారు. ఇటీవల విమానాశ్రయానికి సరిగ్గా కిలోమీటరు దూరంలో ఉన్న 32 ఎకరాల భూములపై లిఖితపూర్వక ఒప్పందాలు పూర్తిచేయించారు. ఇందులో కొన్ని డీ-పట్టా, మరి కొన్ని పట్టా భూములున్నాయి. ఆయన విసిరిన భూ చక్రం భోగాపురం మండలం కంచేరు గ్రామం దాకా వెళ్లి ఆగింది. అక్కడ 20 ఎకరాలపై ఆయనకు పట్టు దొరకడం లేదు. ఇందులో పట్టా భూములున్న రైతులు, అసైన్డ్‌ రైతులు ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరించడం లేదు. ఈ భూములు సరిగ్గా విమానాశ్రయానికి వెనుక భాగంలో ఉన్నాయి. ఈ భూములు తనకు కావాలని ఆ రిటైర్డ్‌ అధికారి పట్టుబడుతున్నారు. ఇక్కడి నుంచి బీచ్‌ వ్యూతో పాటు ఇతర ప్రాజెక్టులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ భూములకు అతి సమీపంలోనే ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రాబోతోంది. ఇక్కడ భూముల విలువ కోట్లలో ఉంది. కానీ చాలా తక్కువ ధరకు భూములు కొట్టేసేందుకు ఆయన తన బంటు త్రిలోకంతో ప్రయత్నాలు చేయిస్తున్నారు. సర్వే నంబర్‌ 270-1 నుంచి 270-3లో భూములున్న రైతులను బలవంతం చేస్తున్నారు. వాళ్లు భూములు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో అమరావతి నుంచి ఫోన్‌లు చేయించి భూములు రాసివ్వాలని ఒత్తిడి చేయించారు.


పట్టాదారుకు బెదిరింపులు

భోగాపురం మండలం కంచేరు గ్రామంలో సర్వే నంబర్‌ 270-1 నుంచి 270-3లో భూములకు సంబంధించిన ఓ పట్టాదారు నరసింహరాజును రిటైర్డ్‌ అధికారి అమరావ తికి పిలిపించారు. కూటమిలోని ఓ కీలకనేత పేరు చెప్పి ఆయనకు భూములు కావాలని, త్రిలోకం చెప్పినట్లు వినాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కీలక నేత కోరుకుంటే భూములు ఇస్తానని, తనను ఆ కీలక నేత వద్దకు తీసుకెళ్లి మాట్లాడించాలని నరసింహరాజు పట్టుబట్టారు. కానీ కీలక నేత వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అంటే.. ఈ భూములు ఆ కీలక నేత కోరుకోవడం లేదని పట్టాదారుకు అర్థమైంది. దీంతో త మ భూములను కాపాడుకునేందుకు ఆయన మరిన్ని ప్రయత్నాలు చేశారు. దీంతో ఆయన్ను బె దిరించి భూములు రాయించుకోవాలని విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక పోలీసు అధికారిని రంగంలోకి దింపారు. ఆ పోలీసు అధికారి పట్టాదారును పిలిపించి.. భూములు వదులుకోవాలని, లేదంటే కేసులు ఎదుర్కొంటావని హెచ్చరించినట్లు తెలిసింది. చివరకు ఓ రెవెన్యూ అధికారిని ఉసిగొల్పి పట్టాదారుకే నోటీసులు ఇప్పించారు. తమ వద్దకు వచ్చి భూమి హక్కును నిరూపించుకోవాలని 10 సార్లు నోటీసులు ఇప్పించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్‌ చేసుకొని పాస్‌బుక్‌లు ఉన్న రైతుకు రెవెన్యూ అధికారి నోటీసులు ఇవ్వడం ఏ చట్టం పరిధిలోకి వస్తుందో? హక్కుదారుకే తన హక్కులను నిరూపించుకోవాలని నోటీసులు ఇచ్చారంటే ఏ స్థాయిలో ఒత్తిడి చేశారో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ చర్యలతో విసిగిన హక్కుదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ రైతుల భూమి మీదకు ఎవరూ వెళ్లడానికి వీల్లేదని హైకోర్టు గత నెలలో చెప్పింది. అయినా రైతును బెదరగొట్టేందుకు కొందరు పోలీసు అధికారుల అండతో ఆ రిటైర్డ్‌ అధికారి బంటు ఆ భూమి చుట్టూ ప్రహరీ కట్టి ంచారు. తన భూమిలో కబ్జా ప్రయత్నాన్ని రైతు నరసింహరాజు అడ్డుకున్నారు. దీంతో ఆ రిటైర్డ్‌ అధికారి కబ్జా చేశారని రైతుపైనే కేసు పెట్టించారు.


హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్‌

నరసింహరాజు సహా పలువురి భూమిపై హక్కులున్నాయని, దీనిపైకి ఎవరూ వెళ్లకూడదని హైకోర్టు ఆదేశించింది. ఇది పోలీసులకు కూడా వర్తిస్తుంది. అయినా ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు పదేపదే ఆ భూమి వివాదంలో తలదూర్చడం చర్చనీయాంశంగా మారింది. తనకు న్యాయం చేయాలని రైతు అధికార యంత్రాంగానికి ఇచ్చిన విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయి. ఆ రిటైర్డ్‌ అధికారి పాచికలే పారుతున్నాయి. రైతుకు న్యాయం జరగడం లేదు. హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోతే రైతులకు దిక్కెవరు?.

నాడు అసైన్డ్‌ భూములు చెర

జగన్‌ ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన పోస్టులోకి వచ్చినప్పటి నుంచే ఆ అధికారి ఉత్తరాంధ్రలో అసైన్డ్‌ భూముల(డీ-పట్టా)పై కన్నేశారు. విశాఖ, భీమిలి, ఆనందపురం, విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలాల పరిధిలో 250 ఎకరాల అసైన్డ్‌ భూములు దక్కించుకోవాలని ప్లాన్‌ వేశారు. అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌కు సంబంధించిన చట్టసవరణ, దాని అమలుకు ఉద్దేశించిన జీఓ 596 వచ్చే నాటికి అంటే.. 2023 డిసెంబరు నాటికి 150 ఎకరాలను గుప్పిటపట్టారు. అసైన్డ్‌ రైతులతో విక్రయ ఒప్పందాలు చేసుకున్నారు. తన మేనల్లుడు, కొడుకుతో పాటు ఉత్తరాంధ్రకే చెందిన రెవెన్యూ లిటిగెంట్‌ త్రిలోకం అనే వ్యక్తితో ఈ వ్యవహారం నడిపించారు. కీలక ఫైళ్లు, పోస్టింగ్‌లు ఆయన ద్వారానే సెటిల్‌ అయ్యాయని ఆ తర్వాత నిర్ధారణైంది. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు వెలుగులోకి తీసుకొచ్చింది.

ఇప్పుడూ ఆయనదే హవా

2024లో ఆ అధికారి రిటైర్డ్‌ అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన హవా కొనసాగుతోంది. కూటమి సర్కారులో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు కొందరు వంత పాడుతున్నారు. ఆయనతో అమరావతిలో బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లకు హాజరవుతున్నారు. రెవెన్యూలో పనిచేసే కొందరు అధికారులు ఆయనకు జీ హుజూర్‌ అంటున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయన సిఫారసు చేసిన వారినే తహశీల్దార్లుగా నియమిస్తున్నారు. ఇంకా డిప్యూటీ తహశీల్దార్‌ హోదాలో ఉన్నవారిని కూడా ఆయన సిఫారసుల మేరకు మండల ఇన్‌ చార్జ్‌ తహశీల్దార్లుగా నియమిస్తున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 05:12 AM