Share News

Bhogapuram International Airport: వైభోగమే!

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:56 AM

ఉత్తరాంధ్ర సముద్రం ఒడ్డున.. పచ్చని అందాల చెంతన.. ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని పంచేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. తీర ప్రాంతానికి దగ్గరగా.....

Bhogapuram International Airport: వైభోగమే!

  • సముద్రం ఒడ్డున..పచ్చని అందాల చెంతన..

  • ఆధునిక హంగులు ‘భోగాపురం’ సొంతం

  • అలల మీదుగా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌

  • ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతి

  • తుఫాన్ల తాకిడినీ తట్టుకునేలా నిర్మాణాలు

  • 18 విమానాలు నిలిపేలా పార్కింగ్‌ సామర్థ్యం

  • అంతర్గత నిర్మాణాల డిజైన్లలో తెలుగుదనం

  • ప్రపంచంతో ఉత్తరాంధ్రకు నేరుగా బంధం

  • ఆర్థిక కేంద్రంగా విశాఖకు మరింత వన్నె

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్ర సముద్రం ఒడ్డున.. పచ్చని అందాల చెంతన.. ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని పంచేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో తుఫాన్ల తాకిడిని తట్టుకునేలా ఈ ఎయిర్‌పోర్టును రూపొందించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులను, ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షపాతాన్ని సైతం తట్టుకునేలా సిద్ధం చేశారు. ఎయిర్‌పోర్టులో చుక్క నీరు నిలబడకుండా పటిష్ఠమైన డ్రైనేజీ వ్యవస్థను నెలకొల్పారు. రాత్రిపూట 18 విమానాలను నిలపగల పార్కింగ్‌ సామర్థ్యం దీని సొంతం. మొత్తం 14 ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యం దీని సొంతం. టెక్నికల్‌ బిల్డింగ్‌ విస్తీర్ణం 81 వేల చదరపు మీటర్లు. విమానాశ్రయం అంతర్గత అంశాలన్నీ ప్రత్యేకమే. ఏ మార్గంలో వచ్చినా.. ఒకవైపు తీరం అందాలు.. మరోవైపు మన్యంలో చూడచక్కని ప్రదేశాలు వీక్షిస్తూ ప్రయాణం చేయవచ్చు.

జంట నగరాలుగా విశాఖ-విజయనగరం

ఎయిర్‌పోర్టు నిర్మాణంతో విశాఖ- విజయనగరం జంట నగరాలుగా అవతరించనున్నాయి. ఉత్తరాంధ్రలోని ఉమ్మడి జిల్లాలను కలుపుతూ 15 రహదారులను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ ఒడిశాలోని కోరాఫుట్‌, గంజాం, గజపతి, మల్కాన్‌గిరి, రాయగడ జిల్లాలతోపాటు ఛత్తీ్‌సగఢ్‌లోని జగదల్‌పూర్‌కు విమాన సదుపాయం అందుబాటులోకి రానుంది. విశాఖ మరింతగా ఆర్థిక కేంద్రం కానుంది. ఏటా 20 వేల టన్నుల సరుకుల ఎగుమతులకు అవకాశం కలగనుంది. అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఇప్పటివరకూ ఉత్తరాంధ్ర ప్రజలు విదేశాలకు వెళ్లాలంటే అటు హైదరాబాద్‌, ఇటు బెంగళూరు, లేదంటే ముంబాయి, ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే అన్ని దేశాలకు, ప్రాంతాలకు విమాన మోక్షం కలగనుంది. భోగాపురం-హైదరాబాద్‌- అమెరికా నేరుగా వెళ్లే ప్రత్యేక విమాన ప్రతిపాదనలు సైతం ఉన్నాయని టెస్ట్‌ డ్రైవ్‌ సందర్భంగా మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

ఉత్తరాంధ్ర సొబగులతో..

ఎయిర్‌ పోర్టును సముద్రం పక్కనే ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు, మత్స్యకారుల సెంటిమెంట్‌ను గౌరవించేలా నిర్మాణం చేపట్టారు. టెర్మినల్‌ను మత్స్య ఆకారంలో చేపట్టారు. నేషనల్‌ హైవే నుంచి ఎయిర్‌ పోర్టుకు చేరుకునేందుకు సుమారు మూడు కిలోమీటర్ల విశాలవంతమైన రోడ్లను నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా..పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ఈ మార్గంలో కొబ్బరి తోటలు కనువిందు చేస్తాయి. ఎయిర్‌పోర్టు ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతం కావడంతో పెండింగ్‌లో ఉన్న నాలుగు శాతం పనులను రెట్టింపు ఉత్సాహంతో పూర్తిచేసే పనిలో ఉంది జీఎంఆర్‌ సంస్థ. ఈ ఏడాది జూన్‌ 26న ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూలై నుంచి విమాన రాకపోకలు మొదలు కానున్నాయి.


బీచ్‌ ప్రత్యేక ఆకర్షణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలోనే ఉంటుంది సముద్ర తీర ప్రాంతం. ఏదైనా విమానం గగనతలం నుంచి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ కావాలంటే గాలికి ఎదురుగా వెళ్తేనే ప్లైట్‌ స్పీడ్‌ కొంత కంట్రోల్‌ అవుతుంది. అందుకు కొంత సమయం పడుతుంది. వేగాన్ని నియంత్రించుకుంటూ టేకాఫ్‌ అవుతుంది. సాధారణ ల్యాండింగ్‌లో విమాన వేగం గంటకు 240 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ వేగంతో ల్యాండింగ్‌ చేసేందుకు కుదరదు. అందుకే గగనతలంలో తిరుగుతూ ల్యాండ్‌ చేయాల్సి ఉంటుంది. విమానం వేగం నెమ్మదించేలా ల్యాండింగ్‌ ఎప్పుడూ గాలికి వ్యతిరేకంగానే ఉంటుంది. విమానాశ్రయానికి వెలుపల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. విమానం ల్యాండింగ్‌ అయిన క్రమంలో తీర ప్రాంత అందాలను వీక్షించవచ్చు. మరోవైపు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు అరకు, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోని అందమైన మన్యం ప్రాంతాలను తిలకించవచ్చు. ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు 1,600 కిలోమీటర్ల దూరం ఉంది. ఈనెల 4న ట్రయల్‌ రన్‌లో అక్కడినుంచి ఇక్కడకు గంటన్నర వ్యవధిలో చేరుకున్నారు. అద్భుత విమాన ప్రయాణం చేశామని.. అరకు అందాలు, తీర ప్రాంత సోయగాలు చూశామని స్వయంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయయుడు తెలిపారు.

ఆంధ్రా ఊటీ అందాలు..

ప్రయాణికులను కట్టిపడేసే దృశ్యాలు ‘భోగాపురం’ సొంతం. ఇతర ప్రాంతాల నుంచి భోగాపురం అల్లూరి సీతారామాజు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకోవాలంటే..అరకు మీదుగా రావల్సి ఉంటుందని చెబుతున్నారు. అరకు వరకు వచ్చేసరికి విమానం కొంత స్పీడ్‌ తగ్గిస్తారు. దీంతో అరకు అందాలు గగన తలం నుంచే చూసే అవకాశం విహాంగ ప్రయాణికులకు ఉంటుంది. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు అందాలు ప్రయాణికులను అబ్బుర పరచనున్నాయి.

Updated Date - Jan 07 , 2026 | 02:56 AM