భోగాపురం విమానాశ్రయం 10 లేక 15 తేదీన ప్రారంభం
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:20 AM
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ నెల ఐదో తేదీన ప్రఽధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా..
విశాఖపట్నం, జూలై 2(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ నెల ఐదో తేదీన ప్రఽధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించి, ఎనిమిదో తేదీ నుంచి కమర్షియల్ ఆపరేషన్లు ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రారంభోత్సవ తేదీలపై జీఎంఆర్ యాజమాన్యం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పెదవి విప్పడం లేదు. అయితే విమానాశ్రయం ప్రారంభోత్సవం ఈ నెల 10 లేదా 15వ తేదీన ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. దీనిపై విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామన్నారు.
ర్యాపిడో, ఓలా, ఊబర్ డ్రైవర్ల ధర్నా
విశాఖపట్నంలో ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు గత రెండు రోజులుగా బంద్ నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థలు తమకు రేట్లు తగ్గించేశారని, రాడార్ విధానం అమలు చేస్తున్నాయని, వారిని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే భోగాపురం విమానాశ్రయానికి ట్యాక్సీలు నడపబోమని హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు నెలలపాటు ఽఆందోళనలు చేయకూడదని ప్రభుత్వం ఎస్మా చట్టం అమలు చేస్తోంది. అయినా సరే డ్రైవర్లు ధర్నా చేయడం గమనార్హం.
విమానాశ్రయంలో మూడు రోజులుగా పూజలు
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో జీఎంఆర్ కుటుంబ సభ్యులు గత మూడు రోజులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పండితులు, పూజలు, హోమాలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇదిలావుండగా విమానాశ్రయంలో ఆధునిక సౌకర్యాలపై సోషల్ మీడియాలో ప్రచారం కోసం పలువురు యుట్యూబర్లను తీసుకువెళ్లారు.