‘భోగాపురం’ రెడీ!
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:14 AM
ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం ఆంతర్జాతీయ విమానాశ్రయం పనులు వంద శాతం పూర్తి అయ్యాయని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.
ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో ‘సంపూర్ణం’
లక్ష్యానికి ముందే 100 శాతం పనులు పూర్తి
త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
టైర్-1 నగరాలకు దీటుగా వసతుల ఏర్పాటు
ఏడాదికి 4 కోట్ల మంది రాకపోకలకు అనుకూలం
20 వేల టన్నుల సామర్థ్యంతో కార్గో నిర్మాణం
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడి
విజయనగరం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం ఆంతర్జాతీయ విమానాశ్రయం పనులు వంద శాతం పూర్తి అయ్యాయని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్టును ప్రారంభించి, జాతికి అంకితం చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంగళవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి రామ్మోహన్‌నాయుడు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 2026 డిసెంబరులోగా విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని, అయితే ఆర్నెల్ల ముందుగానే నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. గత నెల రోజులుగా పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో పరిశీలన ప్రక్రియ నిర్విరామంగా సాగిందన్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారని, ప్రధాని హాజరయ్యే తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏడాదికి నాలుగు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా విమానాశ్రయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. టైర్-1 (మొదటి శ్రేణి) నగరాలకు దీటుగా వసతులు ఏర్పాటు చేశామని, నిర్వాసితుల తోడ్పాటుతోనే ఇంత గొప్ప అద్భుతం కార్యరూపం దాల్చిందన్నారు. రాబోయే 25-50 ఏళ్ల అవసరాలకు వీలుగా సీఎం చంద్రబాబు ముందస్తు చూపుతో విమానాశ్రయ నిర్మాణం పూర్తిచేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా భోగాపురం నిలుస్తుందన్నారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా..
విమానాశ్రయానికి అనుసంధానమయ్యే ఏడు రోడ్లను విశాలంగా, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం మీదుగా ఆరులైన్ల జాతీయ రహదారి కోస్టల్ కారిడార్ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని,రెండేళ్లలో నిర్మాణం పూర్తిఅయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భోగాపురంలో 5 వేల ఎకరాలు సేకరించామని, దీని వల్ల మూడు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. 20 వేల టన్నుల సామర్థ్యంతో భోగాపురం కార్గో నిర్మాణం జరుగుతుందని, ఆక్వా, ఫార్మా రంగంతో పాటు అగ్రికల్చర్, హార్టీకల్చర్ ఉత్పత్తులఎగుమతుల కోసం ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఉపయుక్తంగా ఉండేలా ఎడ్యుసిటీ నిర్మాణం కోసం భూములు అందించిన గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజుకు ధన్యవాదాలు తెలిపారు.
ఒక ఫార్ములా ప్రకారం యూడీఎఫ్ చార్టీలు
భోగాపురం ప్రాంతం అంతర్జాతీయ ఏవియేషన్ హబ్‌గా అవతరించబోతోందని రామ్మెహన్‌నాయుడు పేర్కొన్నారు. పెట్టుబడి, ప్రయాణికుల రద్దీ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొనే.. ఒక నిర్దిష్ట ఫార్ములా ప్రకారం యూడీఎఫ్ చార్టీలు ఉంటాయని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. విశాఖ నుంచి మెట్రో అభివృద్ధి కోసం పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద డబుల్ డెక్కర్ లైన్ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, పూర్తిస్థాయి సర్వే అనంతరం అతి త్వరలోనే మెట్రో సేవలు కూడా కార్యరూపం దాల్చనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ ఎస్.రామసుందర రెడ్డి, ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎస్పీ ఏఆర్ దామోదర్, జీఎంఆర్ ప్రాజెక్టు హెడ్ రామరాజు, జిల్లా అధికారులు ఉన్నారు.
భూములిచ్చిన స్థానికులకు ఉద్యోగాలివ్వండి
ఎయిర్‌పోర్టు పరిశీలన అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తిరిగి బయలుదేరుతున్న సమయంలో కారు దగ్గరకు వచ్చిన రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, స్థానిక టీడీపీ కార్యకర్తలు.. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించారు. విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతు కుటుంబాలు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు దానిపై మాట్లాడటం లేదని తెలిపారు.