జూలై 8 నుంచి విమానాలన్నీ భోగాపురానికే!
ABN , Publish Date - May 23 , 2026 | 03:57 AM
మన రాష్ట్రంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భోగాపురం విమానాశ్రయ కల సాకారం కాబోతోంది.
విశాఖ బదులు ఇక అన్నీ అక్కడికే.. ట్రావెల్ ఏజెన్సీలకు స్కూట్ ఎయిర్‌లైన్స్ సమాచారం
జూలై 5న మోదీ ప్రారంభించే అవకాశం.. ఇంకా తేదీ ఖరారు చేయని పీఎంవో
విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి): మన రాష్ట్రంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం అతి త్వరలో అందుబాటులోకి వస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భోగాపురం విమానాశ్రయ కల సాకారం కాబోతోంది. ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. శరవేగంగా నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూలై 8వ తేదీన విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయంటూ సింగపూర్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. తమ సంస్థ విమాన సర్వీసులు ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి నడుస్తాయని తన ట్రావెల్ ఏజెంట్లకు లేఖ రాసింది. దాని ప్రకారం జూలై 5న విమానాశ్రయం ప్రారంభం అవుతుందని, 8 నుంచి విమానాలు నడుస్తాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని జూలై 5/8/10వ తేదీల్లో ఏదో ఒకరోజు ప్రారంభించాలని, వాటిలో ఒక తేదీని ఖరారు చేస్తే ఏర్పాట్లు చేసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అక్కడ నుంచి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదని ఉత్తరాంధ్రాకు చెందిన ఒక ఎంపీ ‘ఆంధ్రజ్యోతి’కి శుక్రవారం తెలిపారు. విమానాశ్రయం నిర్మించిన జీఎంఆర్ సంస్థకు దీనిపై స్పష్టమైన సమాచారం ఉండి, వారు విమాన సంస్థలకు ఆ వివరాలు తెలియజేసి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటన నేపథ్యంలో జూలై 5న విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించే అవకాశమున్నట్టు సమాచారం.
భోగాపురం కోడ్ కూడా వీటీజెడ్
స్కూట్ ఎయిర్‌లైన్స్ సింగపూర్-విశాఖపట్నం మధ్య గతంలో వారానికి నాలుగు రోజులు విమానాలు నడిపేది. ఇప్పుడు డిమాండ్ తగ్గిందని మూడు రోజులే(సోమ, బుధ, శుక్రవారం) నడుపుతోంది. సింగపూర్ నుంచి రాత్రి 11 గంటలకు వచ్చి తిరిగి 11.15 గంటలకు బయలుదేరి వెళ్తోంది. ప్రయాణికులను ఉద్దేశించే భోగాపురం విమానాశ్రయం ఆపరేషన్ వివరాలు వెల్లడించింది. విశాఖ విమానాశ్రయం కోడ్ వీటీజెడ్ కాగా భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కోడ్ కూడా వీటీజెడ్‌గానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా టెర్మినల్-1లో స్కూట్ ఎయిర్‌లైన్స్ చెక్ ఇన్ కౌంటర్ విమానం బయలుదేరడానికి 2.30 గంటల ముందు తెరుస్తారని, అక్కడ ప్రయాణికులు వివరాలు సమర్పించాలని సూచించింది. విశాఖ నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న భోగాపురం విమానాశ్రయంలో 120 నిమిషాల ముందు ఉండాలని స్పష్టంచేసింది.
జూన్ నెలాఖరుకు రహదారుల పూర్తి
విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లాలంటే జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువ. సిగ్నల్స్ కూడా అధికమే. ప్రస్తుత పరిస్థితుల్లో 50 కి.మీ. ప్రయాణానికి కనీసం 70 నుంచి 90 నిమిషాలు పడుతోంది. ఈ సమయం తగ్గించడానికి, ఇతర మార్గాల్లో విమానాశ్రయం చేరుకోవడానికి వీఎంఆర్‌డీఏ ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టింది. అందులో మూడు పూర్తయ్యాయి. మిగిలిన నాలుగింటిని కూడా విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందే జూన్ నెలాఖరుకు పూర్తిచేస్తామని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.
ఈ-బస్సులు పంపండి
విశాఖ నుంచి భోగాపురం టాక్సీలో వెళ్లాలంటే కనీసం రూ.2 వేలు అవుతుంది. టాక్సీలకు బదులు భోగాపురం విమానాశ్రయం చేరడానికి ఏసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం కోరింది. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి విశాఖకు కేటాయించిన 100 ఎలక్ర్టిక్ బస్సుల్లో 20 భోగాపురం విమానాశ్రయానికి నడుపుతామని ప్రకటించారు. వాటిని కూడా త్వరగా రప్పించాలని, చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం కూడా చేపట్టాలని విమాన ప్రయాణికుల సంఘం ఉపాధ్యక్షుడు ఓ.నరేశ్‌కుమార్ కోరారు.