భోగాపురం విమానాశ్రయ పనులు త్వరలో పూర్తి: జనార్దనరెడ్డి
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:38 AM
భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులు త్వరలో పూర్తి కానున్నాయని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులు త్వరలో పూర్తి కానున్నాయని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో పోర్టులు, హార్బర్ల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని స్పష్టం చేశారు. కోనసీమలో గ్యాస్ లీకేజీల ఘటనలపై జనసేన సభ్యుడు నాగేంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఓఎన్జీసీ విచారణ కమిటీ సిఫారసులు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
రోడ్లను గాలికొదిలేసిన జగన్: బీసీ జనార్దనరెడ్డి
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి విమర్శించారు. జగన్ పాలనలో రోడ్లపై పడిన పెద్ద పెద్ద గుంతల్లో ప్రజలు వరినాట్లు వేసి నిరసన తెలిపారని గుర్తు చేశారు. అప్పట్లో జగన్ స్నేహితుడైన కేసీఆర్ కూడా ఏపీలో రోడ్ల దుస్థితిని ఉటంకిస్తూ హేళనగా మాట్లాడారని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చి నిధులు విడుదల చేయడంతో ఏడాదిలోనే అన్ని రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశామన్నారు.