భోగాపురం ఎయిర్‌పోర్టు 3-4 నెలల్లో ప్రారంభం!
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:55 AM
భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం 98.74 శాతం పూర్తయిందని, జూలై లేదా ఆగస్టులో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.
98.74శాతం పూర్తయిన విమానాశ్రయ పనులు
ప్రధాని మోదీ చేత ప్రారంభించేలా సన్నాహాలు
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడి
భోగాపురం/పార్వతీపురం, ఏప్రిల్ 5 (ఆంధజ్ర్యోతి): భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం 98.74 శాతం పూర్తయిందని, జూలై లేదా ఆగస్టులో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు. విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టును ఆదివారం ఆయన మరో మంత్రి కొండపల్లి శ్రీనివా్‌సతో కలిసి సందర్శించారు. జనార్దన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. విమానాశయ్ర నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుందన్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు జూలైలో 5, 8 తేదీలు, ఆగస్టులో 17, 19 తేదీలను మంచి రోజులుగా భావిస్తున్నామని, అందరి నిర్ణయం మేరకు ముహూర్తం ఖరారు చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు, పుట్టపర్తితో కలిపి ఆరు కొత్త ఎయిర్‌పోర్టులు రానున్నాయని మంత్రి వివరించారు.
రూ.7 వేల కోట్లతో రహదారులు
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అస్తవ్యస్తంగా మారిన రహదారులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం, బలిజిపేట మండలాల్లో ఆదివారం మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దశలవారీగా రహదారుల మరమ్మతులతో పాటు నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టామని వివరించారు. రాబోయే కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. రాజధాని విషయంలో ఇప్పటికే ఆరుసార్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట మార్చారని విమర్శించారు.