Share News

భోగాపురంలో విమానయాన వాతావరణ కేంద్రం

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:27 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోనాటికల్‌ మెటియోరలాజికల్‌ స్టేషన్‌(విమానయాన వాతావరణ కేంద్రం) ఏర్పాటు చేశారు.

భోగాపురంలో విమానయాన వాతావరణ కేంద్రం

  • నేటి నుంచి ట్రయల్‌రన్‌గా బులెటిన్లు

  • 5న విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని

  • 8 నుంచి విమానాల రాకపోకలు

విశాఖపట్నం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోనాటికల్‌ మెటియోరలాజికల్‌ స్టేషన్‌(విమానయాన వాతావరణ కేంద్రం) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం విమాన రాకపోకలకు అవసరమైన వాతావరణ వివరాలు అందిస్తుంది. ప్రతి షిఫ్ట్‌లో వాతావరణ అధికారి, మరో ఇద్దరు సాంకేతిక నిపుణులు ఉంటారు. విమానం టేకాఫ్‌, ల్యాండింగ్‌నకు విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా ఉందా? లేదా? అనేది వాతావరణం కేంద్రం ఎప్పటికప్పుడు బులెటిన్లు విడుదల చేస్తుంది. ముఖ్యంగా పైలట్లు ఈ కేంద్రం అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటారు. బులెటిన్లు విడుదల కోసం ఇప్పటికే విమానాశ్రయంలో యంత్రాలు, కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. పూణే నుంచి నిపుణులు వచ్చారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో వాతావరణ బులెటిన్లు జారీతోపాటు పైలట్లతో సమన్వయం చేసుకునే బాధ్యత తూర్పు నావికాదళం పరిధిలోని వాతావరణ నిపుణులు చూస్తున్నారు. వచ్చే నెల ఐదో తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. ఎనిమిదో తేదీ నుంచి విమాన రాకపోకలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఈనెల 29న భోగాపురం వస్తున్నారు. అందువల్ల ట్రయల్‌ రన్‌గా విమానాల రాకపోకలకు అవసరమైన బులెటిన్లు గురువారం నుంచి విడుదల చేయనున్నారు. భోగాపురంలో పనిచేసే సిబ్బందికి ప్రస్తుతం ఎయిర్‌పోర్టు యాజమాన్యమే విశాఖ నుంచి రవాణా సదుపాయం కల్పించనుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న ఏరోనాటికల్‌ మెటియోరలాజికల్‌ సెంటర్‌ పరిధిలో ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీలోని విమానాశ్రయాల పర్యవేక్షణకు ఒక కేంద్రం గన్నవరం లేదా భోగాపురంలో ఏర్పాటుకానున్నది.

Updated Date - Jun 25 , 2026 | 03:27 AM