‘భోగాపురం’లో ఫీజుల మోత
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:34 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. విశాఖ నగరం నుంచి ఆ విమానాశ్రయానికి వెళ్లడమే దూరాభారం అనుకుంటుంటే..
విమానం ఎక్కితే రూ.826, దిగితే రూ.413 యూడీఎఫ్
ఇంటర్నేషనల్ ఫ్లైట్‌కు మరింత ఎక్కువ
ప్రస్తుత ఎయిర్‌పోర్టుతో పోల్చితే బాదుడే
దూరాభారంతో పాటు ఫీజులూ భారమే
కొంతకాలం వెసులుబాటు ఇవ్వాలంటున్న ప్రయాణికులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. విశాఖ నగరం నుంచి ఆ విమానాశ్రయానికి వెళ్లడమే దూరాభారం అనుకుంటుంటే, అక్కడ యూజర్ డెవల్‌పమెంట్ ఫీజు (యూడీఎఫ్) భారీగా వసూలు చేయాలని నిర్ణయించడం మరో భారం. కాస్త అలవాటయ్యేంత వరకూ ఆఫీజులో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి యూడీఎఫ్ వసూలు చేస్తుంటారు. ఈ ఫీజులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) విమానాశ్రయాల్లో ఒకలా ఉంటే ప్రైవేట్ విమానాశ్రయాల్లో మరో విధంగానూ, అధికంగానూ ఉంటున్నాయి. విశాఖలో విమానాశ్రయాన్ని ఏఏఐ నిర్వహిస్తున్నందున ఇక్కడ యూడీఎఫ్ తక్కువగా ఉంది. ఇటీవల ప్రకటించిన భోగాపురం విమానాశ్రయం యూడీఎఫ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ విమానాశ్రయం కావడమే దీనికి కారణం. ఈ ఫీజులపై ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొత్తగా వచ్చే సౌకర్యం వల్ల ఇబ్బందులు తగ్గాలిగానీ, భోగాపురం విమానాశ్రయం వల్ల ఆర్థిక భారం ఎక్కువవుతోందని ఆ సంఘం ఆరోపిస్తోంది. ఇప్పటివరకు విశాఖపట్నం వచ్చే విమాన ప్రయాణికులు యూడీఎఫ్ చెల్లించడం లేదు. విశాఖ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఒక్కో ప్రయాణికుడి నుంచి యూడీఎఫ్ రూ. 300 వసూలు చేస్తున్నారు. దీనిపై 18 శాతం జీఎస్‌టీ అదనంతో రూ. 354 అవుతోంది.
ఇతర విమానాశ్రయాల నుంచి విశాఖకు వచ్చే వారి నుంచి యూడీఎఫ్ వసూలు చేయడం లేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కూడా ఇవే నిబంధనలు అమలు చేస్తున్నారు. కానీ భోగాపురం విమానాశ్రయం ప్రకటించిన యూడీఎఫ్ రేట్లు చూస్తే చాలా అధికంగా ఉన్నాయి. దేశీయ ప్రయాణికులు ఇక్కడి నుంచి బయలుదేరితే రూ. 700 చెల్లించాలి. దానిపై 18 శాతం జీఎ్‌సటీ అదనంతో రూ. 826 కట్టాల్సి ఉంది. దేశీయ ప్రయాణికులు భోగాపురంలో దిగితే రూ. 350 యూడీఎఫ్ చెల్లించాలి. దానికి జీఎ్‌సటీ కలిపితే రూ. 413 అవుతోంది. అంతర్జాతీయ ప్రయాణికులు దిగితే రూ. 600 యూడీఎఫ్, జీఎస్‌టీ రూ. 108 కలిపి రూ. 708 చెల్లించాలి. అంతర్జాతీయ ప్రయాణికులు ఇక్కడి నుంచి బయల్దేరితే రూ.1,200 యూడీఎఫ్, జీఎ్‌సటీతో కలిపి రూ. 1,416 కట్టాలి.
రెండింటినీ పోల్చుకుంటే...
దేశీయ ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళితే అదనంగా రూ.472 కట్టాల్సి వస్తుంది.
అదే ఇతర ప్రాంతాల నుంచి వస్తే కొత్తగా రూ.413 చెల్లించాలి.
అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళితే కొత్తగా రూ.1,416 కట్టాలి. దిగితే రూ.708 చెల్లించాలి. ఇవన్నీ అదనపు భారాలు
ఎరా స్పందించి రేట్లు తగ్గించాలి
భోగాపురం విమానాశ్రయం ప్రకటించిన యూడీఎఫ్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఎరా) అటు పౌర విమానయాన శాఖతోను, ఇటు విమానాశ్రయం ఆపరేటర్‌తోను చర్చించి యూడీఎఫ్ చార్జీలు తగ్గించాలి. దశ ల వారీగా వాటిని పెంచుకునే అవకాశం కల్పించాలి. ఒకేసారి ప్రయాణికులపై ఇంత భారం మోపకూడదు.
- ఓ.నరేశ్‌కుమార్, డీఎస్ వర్మ, ఏపీ ఎయిర్‌ట్రావెలర్స్ అసోసియేషన్ (అపాటా) ప్రతినిధులు