విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు పనుల్లో ఉద్రిక్తత
ABN , Publish Date - May 16 , 2026 | 04:21 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు పనులు శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
నిరసన తెలుపుతున్న రైతులపై దాష్టీకం
విజయనగరం, మే 15(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు పనులు శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో అధికారులు పనులు నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు రైతులు వచ్చి అడ్డుకున్నారు. తమ వద్ద భూములు తీసుకున్నారని, ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని, తమకు రావలసిన డబ్బులు చెల్లించి పనులు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎక్స్‌కవేటర్ బకెట్‌లో కూర్చుని నిరసన తెలిపారు. ఎక్స్‌కవేటర్ డ్రైవర్ వారిని అదే బకెట్‌తో పైకెత్తి పక్కన పెట్టాడు. దీంతో నష్టపరిహారం కోసం పనులను అడ్డుకుంటే చంపేస్తారా అంటూ కాంట్రాక్టర్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం అంశం న్యాయస్థానంలో ఉందని, తీర్పు వెలువడి పూర్తిగా పరిహారం చెల్లించే వరకూ పనులు నిలుపుదల చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు.