Share News

నేటి నుంచే వైభోగాపురం!

ABN , Publish Date - Aug 17 , 2026 | 04:15 AM

గత నాలుగున్నర దశాబ్దాలుగా విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రితో వీడ్కోలు పలికారు! సోమవారం నుంచి భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం..

నేటి నుంచే వైభోగాపురం!

విజయనగరం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): గత నాలుగున్నర దశాబ్దాలుగా విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రితో వీడ్కోలు పలికారు! సోమవారం నుంచి భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే ‘గగన ప్రయాణం’ ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి మొదటి విమానం సింగపూర్‌కు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు కోడ్‌ ‘వీటీజడ్‌’తో కార్యకలాపాలు నిర్వహించనుంది. విశాఖపట్నం నుంచి భోగాపురానికి 20 ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు భద్రతా బాధ్యతలను సీఐఎస్‌ఎఫ్‌ శనివారమే చేపట్టింది. ‘గేట్‌వే ఆఫ్‌ ది ఈస్ట్‌’గా రూపుదిద్దుకొన్న ఈ విమానాశ్రయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మౌలిక వసతులతో ప్రయాణికులకు స్వాగతం పలుకుతోంది. భవిషత్తులో పెరగనున్న అవసరాలకు అనుగుణంగా విస్తరించగల సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేశారు. ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం కలిగిన ఈ విమానాశ్రయాన్ని భవిషత్తులో 4 కోట్ల సామర్థ్యానికి విస్తరించవచ్చు. ఎయిర్‌పోర్టులో 77,342 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన సమీకృత ప్రయాణికుల టెర్మినల్‌లో చెక్‌ఇన్‌ కౌంటర్లు, భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్‌, బ్యాగేజీ నిర్వహణ, బోర్డింగు, ఆధునిక సదుపాయాలన్నీ సమకూర్చారు. 3800 మీటర్ల కోడ్‌4ఈ రన్‌వే, సమాంతర టాక్సీవేలు, 18 విమానాల పార్కింగ్‌ స్టాండ్లు, ఉన్నాయి.

Updated Date - Aug 17 , 2026 | 04:16 AM