భోగాపురం ఎయిర్‌పోర్టు మ్యూజియంలా ఉంది
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:19 AM
భోగాపురం ఎయిర్‌పోర్టులోకి వెళ్లగానే అది ఎయిర్‌పోర్టులా అనిపించలేదని, మ్యూజియంలా ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ అన్నారు.
ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు: రవిశంకర్
జీఎంఆర్ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ప్రారంభం
భోగాపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టులోకి వెళ్లగానే అది ఎయిర్‌పోర్టులా అనిపించలేదని, మ్యూజియంలా ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గురుదేవ్ రవిశంకర్ అన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా భోగాపురం మండలం దల్లిపేట సమీపంలో జీఎంఆర్ సంస్థ నిర్మించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ ధర్మం అంటే సేవా ధర్మం అని, డబ్బు ఉంటేనే గొప్ప వ్యక్తి కాదని, సేవా గుణం ఉండాలన్నారు. పేదవారికి ఉపాధి చూపే ఆశయంతో వారికి శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు సందర్శించానని, ఎంతో ఆకర్షణీయంగా నిర్మించడం చాలా గొప్ప విషయమని అన్నారు. అనంతరం జీఎంఆర్ సంస్థ అధినేత మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు రాకతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు నైపుణ్యంలో శిక్షణ అవసరమని, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు లక్ష మందికి స్కిల్ డెవల్‌పమెంట్‌లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. అంతకుముందు శిక్షణా తరగతులను పరిశీలించి శిక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు.